‘తూర్పు’న సమ్మె విజయవంతం
సాక్షి, రాజమహేంద్రవరం:
కార్మిక చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఓఎన్‌జీసీ, కాకినాడ పోర్టు ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. జిల్లా అంతటా బ్యాంకులు మూతపడ్డాయి. కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు ర్యాలీల్లో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోటలోని ప్రైవేట్ సంస్థ రాక్ సిరామిక్స్ కంపెనీ 12 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా సమ్మె జరిగింది.
బెజవాడలో ప్రశాంతంగా సమ్మె..
విజయవాడ:
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కోర్కెల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడ నగరంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు , బ్యాంకుల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వేలాదిమంది విధులను బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళనకారులు నినదించారు. విజయవాడ రథం సెంటర్ నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అసంఘటిత రంగంలోని కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, గఫూర్ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు కూడా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ నాయకత్వం వహించారు. సమ్మెలో పాల్గొన్న ఆందోళనకారులు పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బ్యాంకులు పని చేయలేదు. మున్సిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. గుడివాడ, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నం, ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం కనిపించింది. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.