* సీఎం వస్తే అగ్గి మండాలె.. వరంగల్ పర్యటనలో కేసీఆర్
* మూడు రోజులుగా బస్తీల్లో పర్యటన.. పేదలతో మమేకం
* పింఛన్లు, రేషన్‌కార్డులు, రోడ్లు, ఇళ్లపై పేదలకు భరోసా
* నగరాభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి, సమీక్షలు.. తక్షణ ఆదేశాలు
* మూడోరోజు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల సందర్శన
* గరీబ్‌నగర్‌ను అమీర్‌నగర్‌గా మారుస్తానని హామీ
* మహిళలు బిందెలతో బయటికొస్తే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న సీఎం
* నేడు ఇళ్ల కాలనీలకు శంకుస్థాపన
* రేపు కూడా జిల్లాలోనే.. ఐనవోలు పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం!
ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి చూపిస్త. మీకు మొదట ఇళ్లు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పిస్త.
- గరీబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి జూపిస్త’ అని వరంగల్ జిల్లాలోని పేదలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. మూడు రోజులుగా జిల్లాలోనే పర్యటిస్తున్న కేసీఆర్.. తన పర్యటన తర్వాత వరంగల్‌లో సమస్యలు ఉండకూడదని అధికారులను ఉద్దేశించి అన్నారు. బస్తీవాసులకు ఇళ్లు నిర్మించి నగరాన్ని అభిృవృద్ధి చేస్తామని చెప్పా రు. గురువారం నుంచి వరంగల్ జిల్లాలోనే పర్యటిస్తున్న సీఎం.. శనివారం కూడా అధికారులతో కలసి పలు ప్రాంతాలకు వెళ్లారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌నగర్, పరకాల నియోజకవర్గంలోని గరీబ్‌నగర్ బస్తీలను రెండు గంటలపాటు సందర్శించారు.
పేదల ఇళ్లలోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై అక్కడున్న వారికి భరోసా ఇచ్చారు. అధికారులు వెంటనే సర్వే చేసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తారని చెప్పారు. రెండు బస్తీల్లో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఈ గరీబ్‌నగర్‌కు నా పర్యటన లేకుండె. మీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ కడియం శ్రీహరి పట్టుబట్టిండ్రు. వస్తవా.. చస్తవా అని నన్ను గొర్రెను గుంజుకొచ్చినట్లు ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. నేను ఇక్కడికి వచ్చుడు మంచిదైంది.
ఎవడో దుర్మార్గుడు ఈ ఊరికి గరీబ్‌నగర్ అని పేరుబెట్టిండు. ఇది అమీర్‌నగర్ కావాలె. కలెక్టర్ గారు ఇది ప్రజల డిమాండ్. గరీబ్‌నగర్‌ను అమీర్‌నగర్‌గా మార్చాలి. ముఖ్యమంత్రి వచ్చినంక అగ్గి మండాలె. సమస్యలు పారిపోవాలె. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పిన మాట చేసి చూపిస్త. మీకు మొదట ఇళ్లు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పిస్త. తర్వాత సామాజిక పరిస్థితులను బట్టి ఉపాధి అవకాశాలను కల్పించేలా చేస్తా. ముందుగా అధికారులు సర్వే చేస్తరు. అర్హులను గుర్తిస్తారు. ఈ బస్తీల్లో అందరూ పేదలే. పింఛన్లు, కార్డులు అందరికీ వస్తయి. వారం రోజుల్లో మళ్లీ వచ్చి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా. ఎస్‌ఆర్ నగర్ బజార్లు బజార్ల లెక్క లేవు.. బండలు, రాళ్లు ఉన్నయి. ఇవి మారాలె. త్వరలో గరీబ్‌నగర్‌లో ఇంటింటికీ బల్దియా నల్లాలు పెట్టిస్తా. ఏ ఒక్క మహిళ బిందె పట్టుకుని నీళ్ల కోసం బయటికెళ్లినా మీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్ రాజీనామా చేయాలె.
రాజీనామా ఎందుకుగాని ఇక్కడ ఉండి గట్టిగ పని జేయించుండ్లు’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘మీరు కొత్త ఇళ్లలోకి వచ్చినాక నాకు మంచి దావత్ ఇవ్వాలె. ఇత్తరా.. లేదా? గుడుంబాతో వద్దు. ముందు దాని సంగతి చూడాలె. గుడుంబాకు వ్యతిరేకులెవరో చేతులెత్తండి(సభలోని మహిళలు చేతులెత్తారు). మగవాళ్లు కూడా ఎత్తాలె. ప్రాణాలు తీసే గుడుంబాను బంద్‌బెట్టాలె’ అని బస్తీ వాసులతో కేసీఆర్ అన్నారు. డిప్యూటీ సీఎం రాజయ్య, జడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా సీఎం వెంట పర్యటించారు.
సందర్శకులతో రెండు గంటలు
జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే కేసీఆర్ బస చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. ఉదయం ప్రముఖ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కేసీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు దాదాపు 2 వేల మంది వరకు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని బారీకేడ్లతో నిరోధించారు. భారీగా ప్రజలు తరలివచ్చిన విషయం తెలుసుకుని వారిని అనుమతించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటి ఆవరణలోనే అందరినీ కలిశారు. వినతులు, విజ్ఞప్తులు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారు, ఉద్యోగ సంఘాల నేతలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో కేసీఆర్‌ను కలిశారు. అందరి సమస్యలను ఆయన ఓపికగా విన్నారు. మధ్యాహ్మం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సందర్శకులతోనే బిజీగా గడిపారు.
‘కల్యాణలక్ష్మి’ ప్రారంభం
వరంగల్ జిల్లాలో ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తొలిసారిగా 23 పెళ్లి జంటలకు రూ. 51 వేల చొప్పున మొత్తం రూ. 11.73 లక్షలను మంజూరు చేశారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను శనివారం జిల్లా కలెక్టరేట్‌లో పెళ్లి జంటలకు సీఎం స్వయంగా అందజేశారు.
కేసీఆర్ కేరాఫ్ వరంగల్!
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 8న ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చిన కేసీఆర్ 3 రోజులుగా జిల్లాలోనే ఉన్నారు. ఆదివారం కూడా వరంగల్‌లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం వరకు ఆయన వరంగల్‌లోనే ఉంటారని తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుం డా జిల్లాకు వచ్చిన కేసీఆర్ ఎప్పుడు హైదరాబాద్‌కు వెళతారో ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ పర్యటన వెనుక కారణాలేమిటన్న దానిపై ఇటు రాజకీయవర్గాల్లో, అటు అధికారుల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది.
సాధారణంగా ఒక సీఎం జిల్లా కేంద్రంలో 4 రోజులు ఉండడం అరుదైన విషయమే. ఈ పర్యటనలో ఆయన పలు లక్ష్యాలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. పరిపాలనను వేగవంతం చేయడం, విమర్శలు ఎదుర్కొం టున్న సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై పేదలకు భరోసా ఇవ్వడం, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం, ఈ నగరంలో మేయర్ స్థానం దక్కించుకోవడం లక్ష్యాలుగా కేసీఆర్ వరంగల్ పర్యటన సాగుతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. వరంగల్‌లోని బస్తీల్లోనే పర్యటిస్తున్నారు. పేదల ఇళ్లలోకి వెళ్లి నేరుగా ముచ్చటిస్తున్నారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే కాకుండా.. సీఎంగా ఉన్నా తాను ఒకే రకంగా ఉంటాననే సందేశమిచ్చేలా సీఎం పర్యటన ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చిన తర్వాతే వరంగల్ వీడి వెళ్తానని స్పష్టం చేసిన కేసీఆర్.. అందుకు త గ్గట్టే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.
గురువారం పర్యటించిన బస్తీల్లో కొత్త ఇళ్ల కాలనీలకు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు. తాను ప్రకటించిన వాటి అమలు కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి. ఇందులో సీఎం పాల్గొంటారని సమాచారం. మొత్తానికి సీఎం కేసీఆర్ చర్యలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
సమస్యలు పారిపోవాలె: కేసీఆర్
Published Sun, Jan 11 2015 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 8:59 PM
Advertisement
Advertisement