గులాబీయింగ్ | All ZP seats For TRS party | Sakshi
Sakshi News home page

గులాబీయింగ్

Published Sun, Jul 6 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

All ZP seats For TRS party

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దూషణలు.. నినాదాలు.. తోపులాటలు.. వెరసి నాటకీయ, ఉద్రిక్త పరిణామాల మధ్య జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 9వ జెడ్పీ చైర్మన్‌గా గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్‌కు ఆ అదృష్టం దక్కింది. గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి కాంగ్రెస్, టీడీపీ సభ్యుల మద్దతుతో పాగావేసింది.
 
 అధిక సంఖ్యలో జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఆ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులతో కలిసి జిల్లా పరిషత్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులు రెండు ప్రత్యేక వాహనాల్లో జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఎన్నిక నిర్వహించేందుకు 33 మంది సభ్యులు అవసరం కాగా, మొత్తం 37మంది  ప్రత్యేక సమావేశానికి హాజరయ్యా రు. ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో టీఆర్‌ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యా దవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి స మావేశమందిరానికి వచ్చారు.
 
 సభ్యుల హాజ రును లెక్కిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులతో పాటు సమావేశ మందిరంలోకి చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్‌తో వాగ్వాదానికి దిగారు. టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు కూర్చున్న కాంగ్రెస్ సభ్యులను వారికి నిర్ధేశించిన స్థానాల్లో కూర్చునేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. సభ్యుల హాజరు(కోరం)మాత్రమే తనకు ముఖ్యమని, సభ్యులు ఎక్కడ కూర్చోవాలనేది వారి ఇష్టమని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహణకు సహకరించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
 
 నినాదాలు.. దూషణలు
 కాంగ్రెస్ సభ్యులు కొందరు టీఆర్‌ఎస్ శిబిరంలోకి చేరడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశమందిరంలో టీఆర్‌ఎస్ సభ్యులు కూర్చున్న బల్లల వైపునకు దూసుకువెళ్లేందుకు పలుమార్లు యత్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నిక వాయిదా వేయాలని, పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ సభ్యులను తమ వైపు పంపాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు నినాదాలు, దూషణలతో జెడ్పీహాల్ దద్దరిల్లింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు అనూరాధ, కట్ట సరిత కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై దూషణపర్వానికి దిగిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కలెక్టర్ పలుమార్లు మందలించారు. సభా గౌరవాన్ని కాపాడాలని, సభ్యులు ప్రమాణస్వీకారం చేసి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని పలుమార్లు సూచించారు. ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియను నిలిపేయాలని, నిబంధనలు పాటించాలని పట్టుబట్టారు. విప్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికను అడ్డుకుంటే బయటకు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ పలుమార్లు కాంగ్రెస్ సభ్యులను హెచ్చరించారు. సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్నిక జరగడం ఓ దశలో అసాధ్యమనిపించింది.
 
 రెండు గంటలు దాటినా పరిస్థితి సద్దుమణగకపోవడం, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తంచేయడంతో కలెక్టర్ గిరిజాశంకర్ పోలీసుల సాయం కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను మహబూబ్‌నగర్ డీఎస్పీ మల్లికార్జున్ నేతృత్వంలో బయటకు తరలించే క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాణ స్వీకారం చేయకుండానే కాంగ్రెస్ సభ్యులు హాల్ నుంచి నిష్ర్కమించారు. ఈ క్రమంలో నంది ఎల్లయ్య, డీకే అరుణ, చిన్నారెడ్డి ఎన్నిక ప్రక్రియ తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 ఫలితమివ్వని విప్
 జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సభ్యులు గోడదాటకుండా ఉండేందుకు కాంగ్రెస్, టీడీపీలు విప్ జారీచేసినా ఫలితం దక్కలేదు. ప్రత్యేక సమావేశానికి సభ్యులు గైర్హాజరు కావాలంటూ టీడీపీ జారీచేసిన విప్‌ను పార్టీ నాయకులు ఎన్పీ వెంకటేశ్ శనివారం ఉదయం కలెక్టర్‌కు అందజేశారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు బి.అరుణ (ఫరూఖ్‌నగర్), కె.కవితమ్మ (ధన్వాడ), ఖగనాథ్‌రెడ్డి(ఇటిక్యాల), నవీన్‌కుమార్‌రెడ్డి (కొత్తూరు), రమేశ్‌గౌడ్(ఖిల్లాఘనపూర్) సమావేశానికి హాజరయ్యారు.
 
 టీడీపీ నుంచి కె.రామకృష్ణారెడ్డి (అచ్చంపేట), బి.లలితమ్మ (కోయిలకొండ), వెంకటమ్మ (దామరగిద్ద), ఎ.వెంకటయ్య (వనపర్తి), వెంకటేశ్వరమ్మ (వడ్డేపల్లి) కూడా టీఆర్‌ఎస్ శిబిరంలో చేరారు. వీరిలో ఖగనాథ్‌రెడ్డి (కాంగ్రెస్), వెంకటయ్య (టీడీపీ) సమావేశానికి హాజరైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 35 మంది సభ్యుల మద్దతుతో గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ (టీఆర్‌ఎస్) జెడ్పీచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కొత్తూరు జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement