ఆంధ్రా పెత్తనాన్ని సహించం
అల్వాల్, న్యూస్‌లైన్: మల్కాజిగిరి నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో పలు పార్టీలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని పోటీకి దించాయని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు తెలంగాణ ఆత్మగౌరవానికి మరింత బలాన్నిస్తుందన్నారు. ఇకపై ఆంధ్ర పెత్తనాన్ని సహించేదిలేదన్నారు. అల్వాల్ లోతుకుంటలో శనివారం రాత్రి జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్‌సత్తా సత్తా లేకుండా పోయి ఏక్‌సత్తాగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడిని తెలంగాణ వారు వద్దంటున్నా తానిక్కడే ఉంటానని అంటున్నారని, ఆయనిక్కడ ఉండటానికి ఇబ్బంది లేదని, కానీ చక్రం తిప్పుతానంటేనే అభ్యంతరమన్నారు. సెక్రటేరియట్‌లో 90 శాతం మంది ఆంధ్ర ఉద్యోగుల ఉన్నారని వారిని ఆంధ్రప్రభుత్వంలోనే ఉంచాలని అంటుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం అభ్యంతరం చెబుతున్నారన్నారు.
కేవీపీ రాంచందర్‌రావు సహకారంతో టీపీసీసీ పదవి దక్కించుకున్న పొన్నాల లక్ష్యయ్య తెలంగాణ ప్రాంతానికి ఎలా న్యాయం చేయగలుగుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు- వెంకయ్య నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పొత్తు వద్దని కిషన్‌రెడ్డి వారించినా పట్టించుకోకుండా బలవంతంగా కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ, బీజేపీకి ఓటు వేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దన్నారు.
టీఆర్‌ఎస్‌కు 90 స్థానాలు ఖాయం
జీహెచ్‌ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నాయని టీఆర్‌ఎస్ బలహీనంగా ఉందని పలువురు దుష్ర్పచారం చేస్తున్నారని, అయితే మూడు రోజులుగా టీఆర్‌ఎస్ బలపడినట్లు సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. 90 సీట్లు గెలుచుకుని తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటు చేయనుందన్నారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటి వేసి పారదర్శక పాలన అందిస్తామన్నారు. వక్ఫ్, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, అసెంబ్లీ అభ్యర్థులు కనకారెడ్డి, సుధీర్‌రెడ్డి, గజ్జెల నగేష్, రామ్మోహన్‌గౌడ్, కొలను హనంతరెడ్డి, గొట్టిముక్కల పద్మారావు, సుభాష్‌రెడ్డితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మంత్రి ఎన్‌ఏ కృష్ణ, నక్క ప్రభాకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
బాబు వాడుకుని వదిలేశాడు: మైనంపల్లి
కేసీఆర్ చొరవతోనే తాను టీడీపీలో చేరానని, అనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ బయటకు వెళ్లినా పార్టీపై అభిమానంతో తాను టీడీపీలో కొనసాగానని, కానీ చంద్రబాబునాయుడు తనను వాడుకుని వదిలేశాడని మల్కాజిగిరి లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగా తనకు వెన్నుపోట్లు పొడవడం రాదన్నారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ, 24 గంటలు పని చేసేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తానన్నారు.