అమిత్ షా పర్యటన ప్లాప్ షో: ఉత్తమ్
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఒక ఫ్లాప్‌షో అని తెలంగాణ పీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేక పోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటీఐఆర్‌తోపాటు ప్రధాన పథకాల్లో ఏమీ ఆచరణకు నోచుకోలేదని వివరించారు. గత మూడేళ్లలో కనీసం హైకోర్టును కూడా ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ప్రస్తుతం అమిత్‌షా పర్యటించిన ప్రాంతాల్లో సామాన్యులకు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని అన్నారు. స్థానిక పార్టీ నాయకులు నిర్ణయించిన ప్రకారం ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.