
సాక్షి, వరంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపస్‌లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్‌ఎల్‌ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం ఫైనల్ ఇయర్ చదవుతున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండే జీవన్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.