
సాక్షి, హైదరాబాద్: గణేష్ మండలపాల వద్ద డీజేలు, సినిమా పాటలు, డ్యాన్స్‌లు మన సంస్కృతి కాదని..ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు పిలుపునిచ్చారు. దేశ,దైవ భక్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే గణేష్ నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించాలన్నారు. మనమంతా ఒక్కటి కావాలనే సందేశం ఇవ్వడం కోసం జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గణేష్ ఉత్సవాల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత,స్వచ్ఛత,శుభ్రత గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంగా హారతి ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. 10న రవీంద్రభారతీలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు..
ఈ నెల 12న జరిగే 40వ సామూహిక గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భగవంతరావు తెలిపారు.8 గంటలకు లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేష్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, స్వామి ప్రజ్ఞనంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.