
హైదరాబాద్: ఆశా వర్కర్ల వేతనాలను వచ్చే నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. డీఎంహెచ్‌వో ద్వారా జీతాలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో నెలకు రూ.6 వేల వేతనం చొప్పున జమ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గురువారం ఇక్కడ డీఎంహెచ్‌ఎస్ ఆవరణలో జరిగిన తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో మంత్రి మాట్లాడారు. 2వ ఏఎన్‌ఎం, ఈసీ ఏఎన్‌ఎంల సమస్యలను సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులంటే ‘నేను రాను బిడ్డో.. సర్కారీ దవాఖానాకు... అనే వారని, ఇప్పుడేమో ‘పోదాం పదా బిడ్డో.. సర్కారు దవా ఖానాకు’అంటున్నారని చమత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ డీహెచ్ లలితకుమారి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా పురుషోత్తం రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, పారా మెడికల్, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment