‘అభయ’మేదీ!
►అభయహస్తం లబ్ధిదారులు : 11,525 మంది
►నెలవారీగా చెల్లించాల్సింది : రూ.57.62 లక్షలు
►నాలుగు నెలలుగా పెండింగ్ : రూ.2.30 కోట్లు
నిలిచిపోయిన అభయహస్తం పింఛన్లు పంపిణీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం పథకం ఉందో.. లేదో.. తెలియని పరిస్థితి నాలుగు నెలలుగా మహిళల ఎదురుచూపు
రోజుకో రూపాయి చొప్పన పోగేసి ‘అభయ హస్తం’ ప్రీమియం చెల్లిస్తున్న మహిళలు.. అసలు పథకం కొనసాగుతుందో లేదోనన్న డైలమాలో పడ్డారు. ప్రభుత్వం అభయహస్తం పింఛన్లపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం పథకం కొనసాగింపుపై అనుమానాలను పెంచుతోంది. ప్రస్తుతం ‘ఆసరా’ పథకంపై హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. గతం నుంచీ కొనసాగుతున్న అభయహస్తంపై నిర్లక్ష్యం చూపుతోంది. పథకం ప్రారంభమైన 2009 నుంచి ప్రీమియం చెల్లిస్తున్న మహిళల్లో 60 ఏళ్లు నిండిన వారు 4 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
చేవెళ్ల : మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ పథకాన్ని వర్తింపజేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళా సంఘాలలోని సభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసింది. సంఘంలోని ప్రతి సభ్యురాలు ప్రీమియం చెల్లించుకుంటూ పోతే 60 ఏళ్లు నిండిన తర్వాత కనిష్టంగా రూ.500 పింఛన్ అందజేయాలనేది పథకం ఉద్దేశం. వయసును బట్టి ప్రతి సభ్యురాలు సంవత్సరానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ. 365 చెల్లిస్తేనే వీరు ఈ పింఛన్‌కు అర్హులవుతారు. రూ.365తో పాటుగా సర్వీస్ చార్జీగా అదనంగా రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే అభయహస్తం పథకాన్ని అమలుచేస్తారు. సామాజిక పింఛన్లు పొందుతున్న వారు సైతం మహిళా సంఘ సభ్యులుగా ఉంటే వారికి అభయహస్తంలో లబ్ధిదారులుగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీఓ ఏదీ రాకపోవడంతో అధికారులు సైతం అయోమయంలో పడ్డారు.
సంఘంలో సభ్యురాలై ఉండి ప్రస్తుతం రూ. 500 పింఛన్ పొందుతున్న వారికి అభయహస్తం పథకం నుంచి మరో రూ.500 కలిపి ఇస్తారో.. లేదోనన్న అంశంపై మీమాంస నెలకొంది. అయితే ఆధార్ సీడింగ్ చేపడుతున్నామని, అది పూర్తయితే పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
నాలుగు నెలలుగా పింఛన్లు లేవు..
జిల్లా వ్యాప్తంగా అభయహస్తం లబ్ధిదారులు 11,525 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ.57.62 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్క చేవెళ్ల డివిజన్ పరిధిలోనే ఈ లబ్ధిదారుల సంఖ్య 1,724. ఇప్పటికీ సుమారు 1,400 మంది లబ్ధిదారుల వివరాలు ఆధార్‌సీడింగ్ పూర్తిచేసినట్టు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పొందుతున్నవారి వివరాలు సేకరించారు.
అభయహస్తం పింఛన్ వస్తున్నవారు.. మరోసారి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడం లబ్ధిదారులను గందరగోళంలోకి నెట్టింది. ఆసరా పింఛన్లు పంపిణీచేసిన ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులను మాత్రం పట్టించుకోకపోవడంతో ఏ ‘ఆసరా’ లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. తమకు అభయహస్తం పింఛన్ ఇప్పించాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. త్వరగా పింఛన్లు మంజూరుచేసి తమను ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఆధార్ సీడింగ్ కొనసాగుతోంది: మంజులవాణి, ఐకేపీ, ఏపీఓ అభయహస్తం లబ్ధిదారుల ఆధార్‌సీడింగ్ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరికొన్ని సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో కూడా వీరి వివరాలు నమోదు చేస్తున్నాం. మరో వారం పదిరోజులలో పింఛన్లను అందించే అవకాశం ఉంది.