నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ స్పందించింది. జిల్లాలోని 2014-15 విద్యాసంవత్సరానికి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి బుధవారం ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని రోజులుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలూ నిర్వహించాయి. నిరసనలు హోరెత్తుతున్న సమయంలో స్పందించిన అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 17 అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు.
అనుమతిలేనివి ఇంకా మరెన్నో..
17 పాఠశాలలే కాకుండా జిల్లాలో చాలా వరకు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కంఠేశ్వర్‌లోని బైపాస్‌రోడ్డు, చంద్రశేఖర్‌కాలనీలో మూడు పాఠశాలలు, వినాయక్‌నగర్‌లో ఐదు పాఠశాలలు, ఖలీల్‌వాడిలో రెండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. 8 పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర ప్రాంతాలకు మార్పు చేశాయి. ఇలా జిల్లాలోని 86 వరకు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రక్షించేందుకు స్థానిక విద్యాశాఖ అధికారుల ప్రయత్నం!
ఇదిలా ఉండగా అనుమతి లేని పాఠశాలలకు స్థానిక విద్యాశాఖ అధికారులే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్‌లో పదకొండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు దృష్టిసారించలేదు. కొందరు అధికారులు పాఠశాల యాజమాన్యాలతో కుమ్ముక్కై వీటిని తప్పించినట్లు తెలుస్తోంది. జిల్లా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని గుర్తింపులేని పాఠశాలలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అనుమతి లేని స్కూళ్లపై కొరడా
Published Thu, Jul 3 2014 2:44 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement