
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ వేడుకల ద్వారా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకొనేందుకు రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా గురువారం మూడు వేల మంది మహిళలతో రాష్ట్ర చిహ్నమైన మహా తంగేడు పువ్వు ఆకృతి రూపొందించడం, అలాగే ఒకేసారి మూడు వేల బతుకమ్మలను పేర్చడం ద్వారా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. ముందస్తు రిహార్సల్ లేకుండా నేరుగా మహిళలను రంగంలో దింపడం, మరోవైపు సరిపడా సంఖ్యలో మహిళలు లేకపోవడంతో ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. తంగేడు పువ్వు ఆకృతిలో నిలబడలేక కొందరు మహిళలు సొమ్మసిల్లిపోయారు. గిన్నిస్ ప్రతినిధులు 2 అవకాశాలు కల్పించినా ప్రకృతి అనుకూలించలేదు. వరుణుడు ఆటంకంగా మారడంతో రెండో ఈవెంట్ అయిన 3 వేల బతుకమ్మలను పేర్చే ప్రయత్నం కూడా జరగలేదు.
మహిళల సమీకరణలో విఫలం
బతుకమ్మను గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలన్న ప్రయత్నానికి అధికారుల మధ్య సమన్వయ లోపం దెబ్బతీసింది. స్టేడియంలో సున్నంతో మహా తంగేడు పువ్వు ఆకృతిని ఏర్పాటు చేశారు. పసుపు, ఆకుపచ్చ, గునుగు పువ్వు రంగు చీరలు ధరించిన మూడు వేల మంది మహిళలు దీనిపై నిలబడాల్సి ఉంది. మరో వైపు ఒకేసారి బతుకమ్మలను రూపొందించే ఈవెంట్‌కు సంబంధించి ఎడమవైపు 1,500 సున్నపు గళ్లు, కుడివైపు 1,500 సున్నపు గళ్లను 15 వరుసలతో ఏర్పాటుచేశారు. వీటి మధ్య లో సున్నంతో బతుకమ్మ ఆకృతిని ఏర్పాటు చేశారు. అందులో మూడు వేల మంది మహిళలు బతుకమ్మలు తయారు చేసి బతుకమ్మ ఆకృతిలో పేర్చాల్సి ఉంది. రికార్డుకు సరిపడా సంఖ్యలో మహిళలను సమీకరించడంలో అధికారులు విఫలమయ్యారు.
సమయపాలన పాటించకే..
గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన అధికారులు సమయపాలన పాటించలేదు. ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ స్టేడియంలో మహా తంగేడు పువ్వు ఆకృతి, మూడు వేల బతుకమ్మల ఏర్పాట్లు, మహిళ లు మైదానానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. రెండు సార్లు వర్షం కురవటంతో మైదానంలో నీరు చేరి సున్నంతో గీచిన డయాగ్రామ్ చెరిగిపోయింది. సాయంత్రం మూడున్నర ప్రాం తంలో డయాగ్రామ్‌ను గీసి రికార్డ్ ప్రక్రియను ప్రారంభించినా సఫలం కాలేదు.
కర్ణాటక నుంచి బంతిపూలు..
గిన్నిస్ రికార్డు కోసం కర్ణాటక నుంచి 8 టన్నుల బంతిపూలు తెప్పించి వాడారు. అలాగే బాన్సువాడ, నిజామాబాద్ నుంచి 10 డీసీఎం వ్యాన్ల గునుగు పూలు, ఖమ్మం, హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి ఒక డీసీఎం వ్యాన్ తంగేడు పూలు తెప్పించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెడ్ ఛొంగ్తూ, టీఎస్‌టీడీసీ ఈడీ మనోహర్, ఆర్డీవో చంద్రకళ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
మరోసారి విద్యార్థినులతో ప్రయత్నం
మహిళలతో చేసిన ప్రయత్నం విఫలం కావ డంతో రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మరోమారు విద్యార్థినులతో మహా బతుకమ్మ ఫీట్ చేయాలని భావిస్తోంది. తంగేడు పువ్వు కాకుండా మరో పువ్వును ఎంపిక చేసి విద్యా సంస్థలతో కలసి ప్రయత్నించేందుకు సిద్ధమవుతోంది. గిన్నిస్ ప్రతినిధి మరోసారి అవకాశం ఇస్తామని పేర్కొనడంతో రెండు మూడు నెలల్లో తిరిగి ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరో రెండు నెలల్లో రికార్డు సాధిస్తాం..
మహా తంగేడు పువ్వు ఆకృతితో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించాం. కానీ ప్రకృతి అనుకూలించలేదు. మరో రెండు, మూడు నెలల్లో మరోసారి ప్రయత్నించి రికార్డు సాధిస్తాం.
– బుర్రా వెంకటేశం, రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి
మరో అవకాశం ఇస్తాం
మానవులతో మహాపువ్వు ఆకారంతో గిన్నిస్ రికార్డు కోసం మరోసారి అవకాశం ఇస్తాం. మహా తంగేడు పువ్వు ఆకృతి ఏర్పడలేదు. మహిళల సంఖ్య కూడా తక్కువగా ఉంది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రకృతి సైతం అనుకూలించలేదు.
– స్వప్నిల్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి
బతుకమ్మ ఎంతో విశిష్టమైంది
బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పేర్కొన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ గిన్నిస్ రికార్డు ప్రయత్నాన్ని తిలకించేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ పండుగ ఇప్పుడు పండుగలన్నింటిలోకీ తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని తెలిపారు. మహిళలే ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ అని, ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపే పండుగ అని చెప్పారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం పెంచే బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తం కావాలని మిథాలీ ఆకాంక్షించారు.
– మిథాలీరాజ్