ఇక.. గ్రామాలు సారారహితం కానున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న ఆ రక్కసి కోరలు వంచనుంది.
ఇక.. గ్రామాలు సారారహితం కానున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న ఆ రక్కసి కోరలు వంచనుంది. సారా తయారీదారులు, విక్రేతలకు ప్రత్యామ్నాయమార్గంగా స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారు తమ సొంతకాళ్లపై నిలబడేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇక.. పచ్చని గ్రామాలు సారా రహితమై ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి.
తాండూరు:పల్లెల్లో పేదల జీవితాలను ఛిద్రం చేస్తున్న సారా రక్కసి కోరలు వంచేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఎక్కడోచోట సారా తాగి తరచూ జనం మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో సామాన్యులను ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టం చేస్తున్న సారా మహమ్మారిని పల్లెల నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. సారా రహిత గ్రామాల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకుంది సర్కారు. ఇందులో భాగంగా సారా తయారీదారులకు ‘పునరావసం’ కల్పించేందుకు ప్రభుత్వం స న్నాహాలు చేస్తోంది.
సారా తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు భావి స్తున్న జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశాలు ఇచ్చింది. పల్లెల నుంచి సారాను తరిమివేయడానికి సారా తయారీ, విక్రయాలపై ఆధారపడిన ఆయా కుటుంబాలకు పునరావాసం కింద స్వయం ఉపాధిలో శిక్షణ ఇప్పిం చేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విడతల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. పరిగి, తాండూరు, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఎక్సైజ్ సబ్ డివిజన్లలో ఈ మేరకు అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎంపిక చేసిన వారికి మొదట సారా తయారీని మానుకోవాలని అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఒక్కొక్క సబ్ డివిజన్ పరిధిలో మొదటి విడతలో 20 మంది చొప్పున సారా తయారీదారులను శిక్షణకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన సారా తయారీదారులకు డీఆర్‌డీఏ ద్వారా స్వయం ఉపాధిలో శిక్షణ ఇప్పించి సొంతకాళ్ల మీద నిలబడేందుకు చర్యలు తీసుకోనున్నారు. వారికి ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. సారా తయారీదారుల వివరాలు గ్రామాల వారీగా సేకరించడంలో నిగమ్నమైన అధికారులు, ఈ నెలాఖరునాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో పునరావాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక.. గ్రామాల్లో సారా రక్కసి బాధలు తప్పనున్నాయి.