తెలంగాణ సర్కారుపై బీసీ సంఘాల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఫీజు బకాయిలు ఇవ్వకుండా, ఈ విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా స్కాలర్‌షిప్‌లు, ఫాస్ట్ పథకంపై తేల్చకుండా ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఎలా ఇస్తారని బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఏడాదే దిక్కులేదని, వచ్చే ఏడాదికి ఎంసెట్ నోటిఫికేషన్‌ను ప్రకటించడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించాయి.
ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఫీజు బకాయిలను విడుదలచేసి, రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో రెండు, మూడు రోజుల్లో అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజా, జేఏసీ ఉద్యమ సంస్థలతో సమావేశమై ప్రభుత్వానికి విద్యార్థి ఉద్యమ రుచిని చూపుతామని హెచ్చరించాయి. ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నిలదీసిన విద్యార్థులపై కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో టీఆర్‌ఎస్ నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆర్.కృష్ణయ్య (జాతీయ బీసీ సంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం), జి.మల్లేశ్‌యాదవ్ (బీసీ ఫ్రంట్), గుజ్జ కృష్ణ (బీసీ సంఘం), సి.రాజేందర్(బీసీ సంఘర్షణ సమితి), నీల వెంకటేశ్ (బీసీ యువజన సంఘం), కుల్కచర్ల శ్రీనివాస్ (బీసీ విద్యార్థి సంఘం) ప్రశ్నించారు.
ఉద్యమ పార్టీ నుంచి మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కేటీఆర్ దీనిని ఖండించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి గండికొట్టడానికి ఆంధ్ర పాలకులు చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘ఫాస్ట్’కమిటీ వేసి ఆరునెలలైనా ఇంతవరకు విధివిధానాలు రూపొందించక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
బకాయిలుండగానే మళ్లీ నోటిఫికేషనా?
Published Thu, Jan 1 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement
Advertisement