ప్రభుత్వవైద్యులకు బయోమెట్రిక్‌! | Biometric for Government Doctors | Sakshi
Sakshi News home page

ప్రభుత్వవైద్యులకు బయోమెట్రిక్‌!

Published Tue, May 7 2019 1:47 AM | Last Updated on Tue, May 7 2019 1:47 AM

Biometric for Government Doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రులకు సమయానికి రాని ప్రభుత్వ వైద్యులకు చెక్‌ పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి కచ్చితంగా వచ్చేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు మిషీన్‌ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ మేరకు అన్ని ఆ శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవికాకుండా  రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు సహా అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు 1,200 వరకు ఉన్నాయి. వాటిల్లో 3 వేల మందికిపైగా వైద్యులు పనిచేస్తుంటారు.

ఇతర వైద్య సిబ్బంది మరో ఐదారు వేల మంది వరకు ఉంటారు. కొన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్‌ ఉన్నా, చాలా ఆసుపత్రుల్లో ఇంకా ఈ ఏర్పాటు చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకే వైద్యులు పీహెచ్‌సీకి రావాలి. సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. కొన్ని 24 గంటలూ పనిచేసేవి కూడా ఉంటాయి. లక్షలాది మంది పేద రోగులకు ఈ పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులే ఆధారం. కానీ వైద్యులు సకాలంలో రారన్న భావన నెలకొనడంతో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందుతుందన్న భరోసా కల్పించలేకపోతున్నాయి. కొన్ని పీహెచ్‌సీలకైతే వారంలో రెండు మూడు రోజులు కూడా వైద్యులు వచ్చే పరిస్థితి ఉండట్లేదు. మరికొన్నిసార్లు ఎవరూ రాక తాళం వేసిన సందర్భాలూ ఉన్నాయి. దీనివల్ల జబ్బు వస్తే మందు వేసే దిక్కే లేకుండా పోతుంది.

ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. ఎలాగైనా వైద్యులను ఆసుపత్రికి సకాలంలో రప్పించాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంది. ఉదయం 9.30 గంటలకు డాక్టర్‌ ఉంటారన్న నమ్మకాన్ని రోగులకు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

వైద్య సిబ్బంది రేషనలైజేషన్‌.. 
వైద్యులు సకాలంలో ఆసుపత్రికి వచ్చేలా, వారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా చేయాల్సిన బాధ్యతపై గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా సర్కారులో ఉంది. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేసే పరిస్థితి లేదని సర్కారు గమనించింది. సమీప పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రి పెట్టుకొని నడుపుకొంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం కన్నా వారిని ఆకర్షించేలా ప్రోత్సాహకాలు ఇవ్వడమే మేలని భావిస్తోంది. దీనిపై త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి వైద్య సిబ్బంది ఉంటున్నారు. కొన్నింటిలో తక్కువ ఉంటున్నారు.

ఈ పరిస్థితిని మార్చి వైద్య సిబ్బంది హేతుబద్ధీకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇక పీహెచ్‌సీల్లో కేవలం ఎంబీబీఎస్‌ స్థాయి మెడికల్‌ ఆఫీసర్లే కాకుండా స్పెషలిస్టు వైద్యులను కూడా నియమించాలని భావిస్తోంది. వారానికి ఒకట్రెండు రోజులు ఆసుపత్రులకు వెళ్లేలా చూడాలని భావిస్తున్నారు. ఆస్పత్రులను ఆధునీకరించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్నిం టినీ దశలవారీగా బాగు చేయాలని వైద్య,ఆరోగ్య శాఖ భావిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు నమ్మకం కలిగేలా చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement