ఎన్డీయేలో చేరే విషయమై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతికూలంగా స్పందించింది.
న్యూఢిల్లీ: ఎన్డీయేలో చేరే విషయమై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతికూలంగా స్పందించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యే ప్రసక్తిలేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో బలమైన పోరుకు బీజేపీ శ్రీకారంచుడుతోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆహ్వానిస్తే ఎన్డీఏలో చేరే విషయమై ఆలోచిస్తామంటూ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా ఇతర పార్టీలను ఆహ్వానించే అవసరం తమకు లేదన్నారు.
తెలంగాణలో బీజేపీ బలాన్ని నిరూపించుకోడానికి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఒంటరిగా ఎదిగే ప్రయత్నంలో తెలంగాణ నుంచి ఇంకో పార్టీని ఎన్డీయేలోకి తీసుకునే ఆలోచన లేదన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని అన్ని పార్టీలను కలుస్తుంటామని, ఆ క్రమంలో టీఆర్‌ఎస్‌తోనూ సంప్రదించడం జరుగుతుందన్నారు.