
సాక్షి, అచ్చంపేట / జడ్చర్ల టౌన్ : ఎన్నికలంటేనే మరి బోలెడంత ఖర్చు. అయితే ఈ ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పరిమితి దాటొద్దు అంటోది ఎన్నికల కమిషన్. వెచ్చించే ప్రతీ పైసాకు లెక్క
చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తోంది. నంటోంది. ఖర్చు చేసే మొత్తాన్ని కూడానిర్ధేశించింది. అంతేకాదు అభ్యర్థి దేనికెంత వెచ్చించాలో కూడా హద్దులు గీసింది. హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
జాయింట్ అకౌంట్
అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్ పేరు కలిపి బ్యాంకులో జాయింట్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత డబ్బు అయినా, పార్టీ లేదా ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు అయినా సరే అందులోనే జమచేసి రోజువారీగా విత్‌డ్రా చేసి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు కూడా రూ.28లక్షలకు మించికూడదు.
అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో అధికారులు ప్రతీ అభ్యర్థికి ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఒక పేజీలో నగదు వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాలోని నిల్వ, మూడో పేజీలో ఖర్చుల వివరాలు రాయాలి. అభ్యర్థి లేదా వారు నియమించుకున్న ఏజెంట్ ఏరోజుకారోజు ఆ వివరాలను పుస్తకంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
అంతా ఖాతా ద్వారానే...
అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. అంతకు ముందే ఉన్న ఖాతాలను పరిగణనలోకి తీసుకోరు. ఇక కొత్తగా తెరిచిన ఖాతా నుంచే ఎన్నికల ప్రచారం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు వివరాలను బిల్లులతో సహా సమర్పించాలి. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసాను ఎన్నికల కమిషన్ లెక్కించనున్నారు.
కాగా, అభ్యర్థులు తమ విజయం కోసం చేసే ఖర్చుల పద్దు కూడా పెద్దగా ఉండే అవకాశం ఉంది. అయితే గరిష్టంగా ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అన్న మొత్తాన్ని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతీ అభ్యర్థి రూ.28లక్షలకు మించి ఖర్చు చేయొద్దని అదేశించింది. వాహనాలు, భోజనాలు, పార్టీ జెండాలు తదితర వస్తువులకు లెక్కలు రూపొందించింది. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థి ఖర్చు పెట్టే ప్రతీ పైసా లెక్కించనున్నారు.
ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ధరలు
- లౌడ్ స్పీకర్, ఆంప్లిఫ్లయర్, మైక్రోఫోన్ రూ.800 (రోజుకు)
- బహిరంగ సభ వేదిక రూ.2,500
- ప్లాస్టిక్ కటౌట్ రూ.5వేలు, వాల్‌పోస్టర్ రూ.10, ప్లాస్టిక్ జెండా రూ.8, కొత్త జెండా రూ.12
- హోర్డింగ్ ఏర్పాటుకు రూ.15వేలు, మున్సిపాలిటీ అనుమతికి రూ.500
- చెక్కతో తయారు చేసిన కటౌట్ రూ.5వేలు
- ఫొటో, వీడియో గ్రాఫర్‌కు రూ.3వేలు (రోజుకు)
- స్వాగత ద్వారం ఏర్పాటుకు రూ.2,500, టెంట్ రూ.400 నుంచి రూ.800 వరకు (సైజ్ ఆధారంగా)
- కార్పెట్ రూ.250, సైడ్‌వాల్‌కు రూ.80
- భోజనం చేసే విస్తర్లు(ప్లేట్లు) రూ.3లు, టీ రూ.6, టిఫిన్ రూ.15
- విశ్రాంతి తీసుకునే ఇంటి అద్దె రూ.2వేలు
- టోపీ రూ.50, కండువా రూ.10లు, ఎన్నికల గుర్తుతో ఉన్న టీషర్టు రూ.150
- డ్రైవర్లకు రూ.800 (రోజుకు)
- టెంపో రూ.1,600, ట్రాక్టర్ రూ.2,500, కారు 3వేలు, సుమో, క్వాలిస్ రూ.3,500, ఆటో రూ.1000, రిక్షా, మోటార్ సైకిళ్లకు రూ.500
మూడు సార్లు లెక్క చెప్పాలి..
ప్రతీ అభ్యర్థి పోలింగ్ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో సమర్పించాలి. ఈ లెక్కల అధారంగా ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు.. ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ వివరాలను ఖాతాలో కలుపుతారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూపనట్లయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది.
మాధ్యమాల ఖర్చు సైతం..
పత్రికలు, టీవీ చానళ్లులో ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తాల ఖర్చులను కూడా అభ్యర్థుల ఖర్చు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ ఖర్చులను పరిశీలించేందుకు ప్రత్యేక మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటైంది.
Comments
Please login to add a commentAdd a comment