కేసీఆర్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు
సీబీఐ ఎస్పీకి ప్రత్యేక కోర్టు ఆదేశం
కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి ఆస్తులపై ప్రైవేట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అక్రమంగా పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది. అలాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు, మెదక్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి అక్రమంగా డబ్బు ఆర్జించారని, వారి ఆస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వై.బాలాజీ వధేరా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ప్రైవేటు ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఆరోపణలు చేసిన టీఆర్‌ఎస్ మాజీ నేత రఘునందన్‌రావును ఫిర్యాదులో సాక్షిగా పేర్కొన్నారు. ‘‘కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతిల అక్రమార్జన వివరాలను రఘునందన్‌రావు గత ఏడాది మే 15న బయటపెట్టారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ భారీగా డబ్బును ఆర్జించి, బంధువుల పేరుతో స్థిర, చరాస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపించారు. ఫాంహౌస్‌లతోపాటు ప్రైవేటు సీ పోర్టులు, ఓడలు వీరి పేరుతో ఉన్నాయి. సినీనటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోకు ప్రభుత్వ భూముల కేటాయింపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హరీష్‌రావు... తర్వాత కృష్ణను బెదిరించి రూ. 80 లక్షలు వసూలు చేశారని, ఈ సమయంలో విజయశాంతి భర్త శ్రీనివాసప్రసాద్ అక్కడే ఉన్నారని రఘునందన్‌రావు తెలిపారు. కేసీఆర్ అక్రమాస్తులపై ప్రశ్నించిన పార్టీ కార్యకర్తలను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను సీడీ రూపంలో రఘునందన్‌రావు బయటపెట్టారు. ఈ కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు’’ అని బాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మార్ కేసులోనూ కేసీఆర్ ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై కూడా సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. కేసీఆర్ తదితరుల ఆస్తులపై గతంలో తాను పిల్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు సూచన మేరకు సీబీఐకి ఫిర్యాదు చేశానని, అయితే ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్లే ప్రైవేట్ ఫిర్యాదు చేస్తున్నట్లు విన్నవించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు.
అయోమయంలో సీబీఐ అధికారులు...
సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతిల ఆస్తులపై దర్యాప్తు చేయాలా.. వద్దా అనే విషయంలో సీబీఐ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రైవేటు ఫిర్యాదులను తమకు పంపి దర్యాప్తుకు ఆదేశించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉండదని సీబీఐ వర్గాల భావన. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపి, అక్కడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాత్రమే సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అక్రమాలపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసి దాదాపు 20 రోజులు దాటినా సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన దాఖలాలు లేవు.