
‘తుపాకులగూడెం’పై ఛత్తీస్‌గఢ్ కొర్రీ
బ్యారేజీ వల్ల తమ ప్రాంతంలో ముంపు ఉంటుందని అభ్యంతరం
ముంపు అంశం తేలకుండా పనులు చేపట్టరాదంటూ రాష్ట్రానికి లేఖ
సాక్షి, హైదరాబాద్: కంతనపల్లి ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తమ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలోని మూడు, నాలుగు గ్రామాల్లో ముంపు ఉంటుందని అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తమ ప్రాంతంలోని ముంపు తేలకుండా పనులు చేపట్టరాదంటూ అడ్డుపడుతోంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు సమర్పించాకే ముందుకు కదలాలంటూ రాష్ట్ర నీటిపారుదలశాఖకు ఇటీవల లేఖ రాసింది.
ముంపు నదీ గర్భంలోనే...
గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రాజెక్టు కింద 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండ టంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడేనికి మార్చింది. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకుపైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే గ్రామాల ముంపునకు ఆస్కారం ఉండదని వ్యాప్కోస్ సంస్థ సర్వేలో తేల్చింది.
ప్రస్తుతం అక్కడ రూ. 2,323 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. పనుల అంశాన్ని తెలుసుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బీజాపూర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర నీటిపారుదలశాఖకు లేఖ రాశారు. 83 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే తమ ప్రాంతంలోని గ్రామాల్లో ముంపు ఉంటుందనే విషయం టోపోషీట్ల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టు పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కోరారు. అయితే ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది.
బ్యారేజీ నిర్మాణంతో మొత్తంగా 350 ఎకరాల ముంపు ఉంటుందని, ఇందులో 170 ఎకరాలు తెలంగాణ ప్రాంత నదీ గర్భంలో, మరో 180 ఎకరాలు ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని నదీ గర్భంలోనే ఉంటుందని తేల్చిచెబుతోంది. అదీగాక బ్యారేజీ స్లూయిజ్ నిర్మాణం 77 మీటర్ల లెవల్‌లోనే ఉంటుందని, ఈ లెవల్‌లో నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీల వరకే ఉంటుందని, పైన గేట్లు అమరిస్తే బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్ 83 మీటర్లకు చేరి 6.94 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుందని చెబుతోంది. బ్యారేజీలో 83 మీటర్ల స్థాయిలో నీరు చేరిన వెంటనే దిగువకు నీటి విడుదల ప్రక్రియ మొదలవుతుందని, ఈ దృష్ట్యా ఛత్తీస్‌గఢ్‌లో ముంపు అవకాశమే ఉండదని రాష్ట్రం స్పష్టం చేస్తోంది. వీటిని పేర్కొంటూనే ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల కోసం విన్నవించగా కేంద్రం అందుకు అంగీకరించిందని చెబుతోంది. ఈ వివరాలతో త్వరలోనే ఆ రాష్ట్రానికి లేఖ రాయనుంది.