
నేడు యాదగిరిగుట్టకు సీఎం రాక
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు.
భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి రూపొందిం చిన మాస్టర్‌ప్లాన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి అయన ఈ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తిరుపతి క్షేత్రానికి దీటుగా సుమారు రూ.700కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన అంశాలను అయన ప్రస్తావిస్తారు. ఏరియల్ సర్వే అనంతరం యాదగిరిగుట్టలోని హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి కేసీఆర్‌కు అత్యంత ఇష్టదైవం. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పలు కారణాలతో రాలేకపోయారు.
హెలిపాడ్‌కు స్థల పరిశీలన
హెలిపాడ్ కోసం అధికారులు గురువారం రాత్రి గుట్ట పరిధిలోని సైదాపురం, మల్లాపురంలలో రెండు స్థలాలను పరిశీలించారు. పరిశీలించినవారిలో కలెక్టర్ టి.చిరంజీవులు, ఆర్డీఓ మధుసూదన్, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు.