కొత్త చట్టం.. జనహితం | CM KCR Statement On New Revenue Act In 73rd Independence Speech | Sakshi
Sakshi News home page

కొత్త చట్టం.. జనహితం

Published Fri, Aug 16 2019 1:32 AM | Last Updated on Fri, Aug 16 2019 8:45 AM

CM KCR Statement On New Revenue Act In 73rd Independence Speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశ పెడతాం’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుంది. అవినీతిరహిత సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరమొచ్చింది. అందుకే ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మునిసిపాలిటీలను తయారు చేసుకోగలం’అని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం చరిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆయన తెలిపారు. ‘తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశాం. విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడింది’అని తెలియజేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 
 
సుస్థిర ఆర్థికాభివృద్ధి 
గత ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. పటిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలతో ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 14.84% వృద్ధిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయవృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ.4లక్షల కోట్ల విలువైన సంపదుంటే, నేడు రూ.8.66లక్షల కోట్లకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది. గడిచిన ఐదేళ్ళలో ఐటీ ఎగుమతులు రూ.52వేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతుంది. 

గురువారం గోల్కొండలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం చేస్తున్న పోలీసులు. జాతీయ జెండాకు సెల్యూట్‌ చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో సీఎస్‌ ఎస్‌కే జోషి
60 రోజుల కార్యాచరణ ప్రణాళిక 
కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్‌ చట్టాల అమలుతో నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడానికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫైనాన్స్‌ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు.. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. మొదటిదశలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ప్రజాసంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రంగా చెత్తనిర్మూలనకు నడుంకట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చిమొక్కలు. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు. పాడుబడ్డ పశువుల కొట్టాలు. మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న గుంతలు, పాడుపడిన బావులు.. ఇవీ రాష్ట్ర వ్యాప్తంగా కనినిపిస్తున్న దృశ్యాలు. వీటన్నింటినీ ఈ 60 రోజుల్లో తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలి. 
 
విద్యుత్‌ వారోత్సవాలు 
విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్‌ వీక్‌ నిర్వహించుకోవాలి. వంగిన కరెంట్‌ పోల్స్‌ను, వేలాడే వైర్లను సరిచేయాలి. తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోల్స్‌ వేయాలి. అన్ని గ్రామాలు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. 
  
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు 
రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను 60 రోజుల కార్యాచరణలో భాగంగా స్థానికసంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్‌ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను కచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామబడ్జెట్లో 10% నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్‌ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే 6మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి జాగ్రత్తగా పెంచేలా ప్రేరణ కలిగించాలి. 

 కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేసీఆర్‌ 

పంచాయతీరాజ్‌లో ఖాళీలన్నీ భర్తీ 
పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతిపథంలో పయనించేందకు వీలుంటుంది. పంచాయతీరాజ్‌ శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జోనల్‌ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటాను 95 శాతానికి పెంచాం. 

 మన రైతాంగ విధానం దేశానికే ఆదర్శం 
తెలంగాణ ప్రభుత్వ రైతాంగ విధానం యావద్భారతానికి ఆదర్శంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
అదనంగా 575 టీఎంసీలు 
గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్‌ నుంచి తెలంగాణ రైతాంగం అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టీఎంసీల నీరు లభిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీంఎసీలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దేవాదుల ద్వారా 75టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలుంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11లక్షల 20వేల ఎకరాలకు సాగునీరందేలా చేసుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత వేగంగా నిర్మించి ఉమ్మడి పాలమూరుతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందిస్తామని తెలియచేస్తున్నాను. 
 
ఆరోగ్య తెలంగాణ దిశగా.. 
ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. వీటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్‌ ప్రొఫైల్‌’తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జంటనగరాల్లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

తండాల్లో తొలిసారిగా జెండా వందనం 
గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చడంతో ఇవాళ మొదటి సారిగా అక్కడ సర్పంచ్‌లు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది.  
 
పింఛన్లు రెట్టింపు 
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పింఛన్‌ ఇస్తున్నాం. వృద్ధాప్య పింఛన్‌ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకరు తగ్గించి పింఛన్‌ను అందించాలని నిర్ణయించాం. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

గోల్కొండ ‘కళ’కళ !
సాక్షి, హైదరాబాద్‌ : గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవం కన్నులపండువగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందల మంది కళాకారులు గోల్కొండ కోటపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే కళారూపాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.  గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ వస్తున్న తరుణంలో డప్పు చప్పుళ్ల హోరుతో 16 కళారూపాలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సైతం ఆకట్టుకుంది. 

ప్రగతి భవన్‌లో జెండా వందనం 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానానికి చేరుకుని అక్కడి సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించా రు. అక్కడి విజిటర్స్‌ బుక్‌లో సంతకం చేశారు. అనంతరం గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించారు. 15వ బెటాలియన్‌ సహాయ కమాండెంట్‌ శ్రీధర్‌ రాజా, మంచిర్యాల డీసీపీ నేతృత్వంలో నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. కవాతులో పాల్గొన్న ఒడిశా పోలీసు కాంటింజెంట్‌కు కేసీఆర్‌ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement