
నన్ను తీస్కపోయి.. మీ ఇంటి కాడ కట్టేసుకో..
హన్మకొండలోని దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి పర్యటన, ప్రసంగం సరదా వ్యాఖ్యలతో సాగింది.
సరదా వ్యాఖ్యలతో సాగిన సీఎం ప్రసంగం
జనంతో మమేకం
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి పర్యటన, ప్రసంగం సరదా వ్యాఖ్యలతో సాగింది. కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ జనంలో ఆసక్తిని పెంచారు. కాలనీలో తిరిగిన అనంతరం స్టేజీ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అందరినీ ‘మీరంతా ఈ బస్తీ వాళ్లేనా’ అని ప్రశ్నించారు. మహిళల నుంచి ‘ఔను’ అంటూ సమాధానం రాగానే స్టేజీ నుంచి నేరుగా వారి మధ్యలోకి వెళ్లి కూర్చున్నారు. కాలనీ సమస్యలపై మహిళలతో మాట్లాడారు. ఆయన వె ంట డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కూర్చున్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చి ప్రసంగం మొదలు పెట్టారు. ఇందులో ఓ మహిళ తనకు పింఛన్ రావడం లేదని పదేపదే చెపుతుండటంతో కేసీఆర్ తన ప్రసంగం ఆపి...‘ ఓ.. అవ్వా... ఏంది నీ లొల్లి.. పింఛన్ వస్త లేదా.. చెపుతాన్నగద అందరికీ ఇత్తరని.. సర్వే చేసి ఇస్తరు’ అని అన్నారు. అయినా ఆ మహిళ ఆలాగే మాట్లాడుతుండటంతో ‘ఇగో ఓ పని చేయ్.. సప్పు డు చెయ్యక నన్ను పట్టుకపోయి మీ ఇంటి కా డ కట్టేసుకో.. పని ఒడుస్తది’ అని అనగానే అంతా ఒక్కసారిగా నవ్వారు.
కేసీఆర్ ప్రజలకు వరాలు కురిపిస్తుండడంతో జనం అదేపనిగా చప్పట్లు కొడుతున్నా రు. దీంతో కేసీఆర్ కల్పించుకుని ఇదే మనకున్నది అందుకే తెలంగాణ ఇట్లయింది. నా మాట మొత్తం ఇనుండ్లి.. ఇన్నంక చప్పట్లు కొట్టుండ్లి.. మీ ఇల్లు పూర్తయినంక ఓపెనింగ్ కు నేనే వస్త..అన్నారు. దీంతో సభ మరోసారి చప్పట్లతో మార్మోగింది.