'టీ'బ్రాండ్... చలో చైనా
తెలంగాణ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పర్యటన
♦ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బయలుదేరుతున్న సీఎం బృందం
♦ రేపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం
♦ పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి
♦ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రసంగించనున్న కేసీఆర్
♦ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రతినిధి బృందం
♦ శనివారమే చైనాకు చేరుకున్న ఇద్దరు ఐఏఎస్‌లు
♦ పది రోజులపాటు పర్యటన.. 16న తిరిగి రాష్ట్రానికి సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన జరగనుంది. దాదాపు పది రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం జరపనున్న ఈ పర్యటనకు... ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశంలోనే వినూత్నంగా సింగపూర్ తరహాలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రచారం చేయాలని... దేశ విదేశాల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. అంతేకాదు ఔషధ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అనుకూల పరిస్థితులను చాటి చెప్పనుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే (సోమవారం ఉదయమే) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం చైనా పర్యటనకు బయల్దేరుతోంది.
అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘న్యూ చాంపియన్స్-2015’ సదస్సులో సీఎం కేసీఆర్పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి సంస్థలు, వివిధ దేశాలు, పౌర సమాజాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఈ సదస్సులో... నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై చర్చ జరుగనుంది. 9 నుంచి 11వ తేదీ వరకు చైనాలోని డేలియన్‌లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ ఫిలిఫ్ రోస్లర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాల్లో జరిగే చర్చలో అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. విధానాల రూపకల్పనలో కొత్త పంథాను అనుసరించటం వల్లే తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇప్పటికే ప్రశంసించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే సదస్సు కావటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనకు మొగ్గు చూపింది. కేసీఆర్ ఈనెల 9న ఈ సదస్సులో ప్రసగించనున్నారు.
టార్గెట్ బ్రాండ్ ఇమేజీ
రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి చైనాలోని పలు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. వీటితో పాటు హార్డ్‌వేర్ పరిశ్రమల స్థాపనకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఆగస్టులో చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, విద్యుత్ పరికరాల తయారీకి సహకారం అందిస్తామని కూడాప్రకటించారు. ఇక సిచువాన్ ప్రావిన్స్‌తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు చెంగ్డూ పట్టణాన్ని సందర్శించాలంటూ అక్కడి విదేశీ వ్యవహారాల కార్యాలయం గత ఏడాది నవంబర్‌లో సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన లేఖ పంపింది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ సదస్సును పురస్కరించుకొని చైనా పర్యటనకు వెళ్లడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.
ప్రత్యేక విమానంలో..
సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు మొత్తం 15 మందితో కూడిన ప్రతినిధి బృందం చైనా పర్యటనకు బయల్దేరుతుంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజిన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, సెక్యూరిటీ వింగ్ ఐజీ భగవత్ మహేష్ మురళీధర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి జోగినిపల్లి సంతోష్‌కుమార్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్ల నిమిత్తం పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ నర్సింహారెడ్డి శనివారమే చైనాకు వెళ్లారు.
పది రోజుల ట్రిప్
ఖరారైన షెడ్యూల్ ప్రకారం 7వ తేదీ నుంచి 16 వరకు పది రోజుల పాటు కేసీఆర్ చైనా పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న ప్రభుత్వ ప్రతినిధి బృందం రాత్రికి చైనాలోని డేలియన్‌కు చేరుకుంటుంది. మూడు రోజుల పాటు అక్కడ బస చేస్తుంది. అక్కడ 9వ తేదీన జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఈ బృందం పాల్గొంటుంది. 10న డేలియన్ నుంచి బయల్దేరి షాంఘై చేరుకుని, అక్కడ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి జరిపి, షోజ్‌హో ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శిస్తారు. 11న షాంఘై నుంచి బీజింగ్ చేరుకుంటారు. 14వ తేదీన షెంఝెన్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శిస్తారు. అదేరోజున హాంగ్‌కాంగ్‌కు చేరుకుంటారు. 16న మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.