
పింఛన్ల కోసం కలెక్టరేట్ ముట్టడి
సాక్షి నెట్‌వర్క్: పింఛన్ల కోసం లబ్ధిదారుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఉన్న ‘ఆసరా’ కోల్పోతున్నామనే ఆందోళనతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. బీజేపీ ఆధ్వర్యంలో సుమారు వందమంది కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు.
ఆ సమయంలో కలెక్టరేట్‌లో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ నెలాఖరులోగా సమస్య పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి సర్దిచెప్పారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అలాగే, ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట, మందమర్రిలో ఆందోళనలు జరిగాయి.
రంగారెడ్డి జిల్లాలో...
పలు పార్టీల ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు భారీగా తరలివచ్చి, శ్రీశైలం రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను పంపించి వేశారు.
పింఛన్ రాదేమోనని.. ఏడుగురి మృతి
పింఛన్ జాబితాలో తమ పేరులేదని, పింఛన్ రాదేమోననే మనస్తాపంతో గురువారం ఏడుగురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లా బోర్నపల్లికి చెందిన గుగ్గిళ్ల రాజమల్లు(74), జగన్నాథపూర్‌కు చెందిన నగరబోయిన గట్టయ్య(71), వేగురుపల్లికి చెందిన అమరగోని భూమమ్మ(75), మహబూబ్‌నగర్ జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన రంగం అబ్దులమ్మ (68), ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన చౌహాన్ లాలసింగ్ (70), నల్లగొండ జిల్లా మరిపడిగ గ్రామానికి చెందిన తాటి సాయిలు (72), నిజామాబాద్ జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) పింఛన్ రాదేమోనని ఆందోళనతో మృతి చెందారు.