సమయపాలన పాటించరా..
♦ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఫైర్
♦ అంతారం హైస్కూల్, తాటిపల్లి కేజీబీవీలను తనిఖీ చేసిన రోనాల్డ్ రోస్
మునిపల్లి : ‘మీ పిల్లలైతే ఇలానే చేస్తారా’ అంటూ కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఉపాధ్యాయుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంతారం హైస్కూల్, తాటిపల్లి కేజీవీబీ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అంతారం పాఠశాల ఉపాధ్యాయురాలు ఒక్కరే 9.30 గంటల సమయంలో విద్యార్థులతో ప్రార్థన చేసి తరగతి గదిలోకి వెళ్తున్న సమయంలో కలెక్టర్ ఆకస్మికంగా వచ్చి పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం ఎంత మంది ఉపాధ్యాయులున్నారు... వారు ఎందుకు ప్రార్థనలో పాల్గొనలేదో చెప్పాలని కలెక్టర్ ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిష్టర్ తీసుకుని నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు రాసి సంతకం చేశారు.
కలెక్టర్ వచ్చిన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కలెక్టర్ వద్దకు రాగానే ‘మీ ఉళ్లో విద్యార్థులకు పాఠశాలు బోధించే ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుంటే అధికారులకు ఎందుకు చెప్పడంలేదని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేదని, సమయానికి బస్సు దొరకలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారని గ్రామస్తులు చెప్పడంతో అయితే హెలికాప్టర్ పంపాలా అంటూ కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టరైనా, అధికారులైనా, ఉపాధ్యాయులైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. అక్కడి నుంచి తాటిపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు వచ్చి రాగానే మొత్తం ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారని అడిగారు.
ఏడుగురు అని ఉపాధ్యాయులు చెప్పారు. ఏడుగురిలో నలుగురే ఉన్నారు.. మిగతా ముగ్గురు ఎందుకు రాలేదని కలెక్టర్ ప్రశ్నిస్తూ సమయ పాలన పాటించని ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కస్తూర్బాగాంధీ పాఠశాల గదులు, మరుగు దొడ్లు, నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతాలోపంతో పనులు చేపడుతున్న మేస్త్రీని కలెక్టర్ నిలదీశారు. ఇలాగే పనులు చేపడితే జైలులో పెట్టిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటిని ఇలానే నిర్మించుకుంటారా అంటూ సర్పంచ్ అల్లం నవాజ్‌రెడ్డిని నిలదీశారు. అనంతరం మొక్కలను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి అంతారం సర్పంచ్ సిద్దన్నపాటిల్ ఉన్నారు.