నువ్వుంటే ఎంత..? పోతే ఎంత..?
- పార్టీయే ఆయన్ను మోసిందని వ్యాఖ్య
- పదవుల్లో 30 ఏళ్లు.. పదవి లేకుండా 30 రోజులు ఉండలేరా అని నిలదీత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేత డి.శ్రీనివాస్ వదిలివెళ్లడం వల్ల పార్టీకి నష్టమేమీ లేదని టీపీసీసీ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ, మండలిలో విపక్షనేత జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఉన్నంతకాలం డీఎస్‌ను పార్టీయే మోసిందని, పార్టీని ఏనాడూ డీఎస్ మోయలేదన్నారు. ‘పార్టీలో 30 ఏళ్ల పాటు ఎన్నో పదవులను డీఎస్ అనుభవించారు. పదవి లేకుండా 30 రోజులు కూడా పార్టీకి సేవచేయలేకపోయారు.
పార్టీకోసం లక్షలాదిమంది కార్యకర్తలు కష్టపడితే, ఆ ఫలితాన్ని ఆయన అనుభవించారు. ఆయన వెళ్లడం వల్ల సొంత జిల్లాలో ఎవరికీ నష్టంలేదు. కష్టకాలంలో పార్టీలో పనిచేయాలనే ఆలోచన లేని డీఎస్‌లాంటి వారు ఉంటే ఎంత, పోతే ఎంత’ అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌కు ఏనాడూ అవమానం జరగలేదని, ఎంతో గౌరవాన్ని చూపిందన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం, రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనను పారీ ్టగౌరవించిందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ప్రతిపక్షనేతగా గౌరవాన్ని కల్పించిందని టీపీసీసీ నేతలు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశాల్లేవని, అన్యాయం జరుగుతున్నదంటూ డీఎస్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
ఆయన రిటైరైతే ఆ స్థానంలో బీసీ వర్గానికే చెందిన మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, ఇది బీసీలకు అన్యాయం జరిగినట్టు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా పీసీసీకి 2 సార్లు అధ్యక్షునిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన డీఎస్ కూడా బీసీవర్గానికే చెందిన నేత అనే విషయం మరిచిపోవద్దన్నారు. పార్టీలో ఏ నిర్ణయం జరిగినా ఉమ్మడిగానే ఉంటుందని, ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్‌తో సహా ఏ ఒక్కరిపైనా నిందలు వేయడం డీఎస్‌లాంటి నేతకు సరైందికాదని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌నేతలు రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.