సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా క్లైమాక్స్‌కి చేరింది. రెండు రోజులు హైదరాబాద్‌లో జరిపిన కసరత్తు అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ భక్తచరణ్‌దాస్ కమిటీ సమర్పించింది. చరణ్‌దాస్ ఆధ్వర్యంలో త్రిసభ్య స్క్రీనింగ్ కమిటీ మహాకూటమిలో భాగంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించిన స్థానాలను వదిలేసి మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
70–75 మందితో తొ లి జాబితా విడుదల చేసేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్న క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 స్థానాలకు అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. సామాజిక కోణంలో ఒకరు బ్రాహ్మణ, నలుగురు రెడ్డి, ముగ్గురు బీసీలు, ఇద్దరు వెలమ, ముగ్గురు షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే భేటీ అనంతరం అభ్యర్థుల జాబితాపై అధిష్టానం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో ఆరుగురికి చోటు దక్కనుందని తెలుస్తోంది. కాగా.. స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన జాబితాపై కొందరు ఆశావహులకు ఉప్పందగా, చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారు.. ఐదు స్థానాలకు ‘సింగిల్ నేమ్’..
ఉమ్మడి జిల్లా ఆరు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. జగిత్యాల, మంథని, కరీంనగర్, వేములవాడ, పెద్దపల్లి, సిరిసిల్ల నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. తాటిపర్తి జీవన్‌రెడ్డి (జగిత్యాల), డి.శ్రీధర్‌బాబు (మంథని), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), కేకే మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల)పై ఇదివరకే స్పష్టత వచ్చినా.. సీహెచ్ విజయరమణారావు (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (వేములవాడ)పై ఆశావహ నేతలు ఫిర్యాదులు పరంపర కొనసాగిస్తున్నారు. అయితే.. బుధవారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం అధిష్టానం ఈ ఆరుగురి పేర్లను తొలిజాబితాలో ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే కోరుట్ల, రామగుండం నియోజకవర్గాలు మినహా మరో ఐదు నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కో పేరును స్క్రీనింగ్ కమిటీకి ప్రతిపాదించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఒక్కో పేరు ప్రతిపాదించిన జాబితాలో చొప్పదండి, హుజూరాబాద్, మానకొండూరు, హుస్నాబాద్, ధర్మపురి నుంచి డాక్టర్ మేడిపల్లి సత్యం, పాడి కౌశిక్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్‌కుమార్ పేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే.. సామాజిక కోణంలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాల, మాదిగ కులాలకు చెందిన వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ ఉండటంతో ఈ స్థానాల నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, కవ్వంపెల్లి సత్యనారాయణ తదితరులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఈ ఐదు స్థానాల్లోనూ కొన్నింటిపై కూటమి భాగస్వామ్య పార్టీలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రకటనను మలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. కాగా.. తొలి జాబితా నేటి మధ్యాహ్నం జరిగే సమావేశం అనంతరం గానీ, లేదంటే మరుసటి రోజుగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. లేదంటే ఏడో తేదీలోగా అభ్యర్థుల జాబితా మొత్తంగా ప్రకటించవచ్చని అంటున్నారు.
ఆ ముగ్గురు నేతల నిర్ణయమే తరువాయి.. నాలుగు స్థానాలపై పీటముడి..
ఆరు స్థానాలలో అభ్యర్థులపై స్పష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో ఏడు స్థానాల విషయమై ఆచీతూచీ వ్యవహరిస్తోంది. పొత్తుల్లో భాగంగా టీజేఎస్, టీటీడీపీ, సీపీఐలు మొదట ఆరు స్థానాలపై కన్నేశాయి. టీడీపీ హుజూరాబాద్, కోరుట్ల, సీపీఐ హుస్నాబాద్, టీజేఎస్ కరీంనగర్, హుజూరాబాద్, రామగుండంపై దృష్టి పెట్టాయి. అయితే.. పొత్తుల్లో భాగంగా ఆయా పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా పాలసీని మార్చుకున్నాయి. ఇప్పుడు సీపీఐ హుస్నాబాద్, టీజేఎస్ రామగుండం, హుజూరాబాద్‌లు, టీడీపీ కోరుట్లను అడుగుతున్నాయి. రామగుండం నుంచి పోటీ చేసేందుకు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అతనితోపాటు టీజేఎస్ జిల్లా చైర్మన్ ముక్కెర రాజు కోసం హుజూరాబాద్‌ను అడుగుతున్నారు.
ఇదే సమయంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కోరుట్లలో పోటీ చేసే విషయం ఫిప్టీ ఫిప్టీ ఛాన్స్‌గా చెప్తున్నారు. హుస్నాబాద్‌పై మాత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కీలక నేతలు తీసుకునే నిర్ణయంపైనే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి వీలుంటుంది. ఒకవేళ రామగుండంను కోదండరామ్ కాదనుకుంటే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్‌కు, కోరుట్లలో రమణ కాదంటే జువ్వాడి నర్సింగారావు, హుజూరాబాద్‌ను టీజేఎస్‌కు కాదంటే పాడి కౌశిక్‌రెడ్డి, హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలని ఏఐసీసీకి స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు చెప్తున్నారు.
అదేవిధంగా మానకొండూరు, ధర్మపురి, చొప్పదండిలలో రెండు మాదిగ, ఒకటి మాల కులానికి చెందిన ఆశావహులకు టికెట్ ఇచ్చేలా జాబితా రూపొందించినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదిలా వుంటే ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులు, ఐదు నియోజకవర్గాలకు ఒక్కటే పేరు, రెండు స్థానాలకు మిత్రపక్షం/కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లతో జాబితా స్క్రీనింగ్ కమిటీకి చేరిందన్న సమాచారంతో ఉమ్మడి జిల్లాకు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఆశావహులు చాలా మంది బుధవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు ఏఐసీసీకి పంపిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా లీక్ కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఢిల్లీకి తరలడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థుల ప్రకటనపై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనన్న చర్చ సర్వత్రా సాగుతుండగా, అభ్యర్థుల జాబితా ప్రకటించే చివరి ఎవరి పేర్లు ఉంటాయో? చెప్పడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment