వెల్దండ (కల్వకుర్తి): హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్రతండాపై ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామస్తులు ఎవరూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. మండలంలోని కొట్రతండాలో ఆదివారం అర్ధరాత్రి ఏఎస్పీ జోగుల చెన్నయ్య, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో 30 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంపై పోలీస్ నిఘా ఉంచుతున్నామన్నారు.
ప్రధాన జాతీయ రహదారులపై ఉన్న గ్రామాలు, తండాలు, పట్టణాలకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించ వద్దన్నారు. రౌడీ షీటర్లుగా పేరున్న వ్యక్తులతో సంబంధాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల తనిఖీలో అలాంటి వ్యక్తులను గుర్తిస్తే తండావాసులు ఇబ్బందులు పడతారన్నారు. తండాలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీపంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే అక్రమంగా మద్యం, అధిక మొత్తంలో డబ్బులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు.
క్షుణ్ణంగా తనిఖీలు..
కార్డెన్ సెర్చ్‌లో భాగంగా బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతిఒక్కరి గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనదారులు వీటికి సంబంధించిన పత్రాలను, లైసెన్స్‌లను చూపించితే తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గ్రామంలోని పలు కిరాణం షాపుల్లో మద్యం లభించడంతో దుకాణదారులను హెచ్చరించారు. ఇకపై ఇలాంటివి కనిపిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్దండ, కల్వకుర్తి సీఐలు గిరికుమార్ కల్కోట, సురేందర్‌రెడ్డి, ఆయా మండలాల ఎస్‌ఐలు వీరబాబు, ప్రదీప్, కృష్ణయ్య, నర్సింహ, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment