‘కూపన్’తో కూపీ లాగారు.. | 'Coupon' dragged to kupi | Sakshi
Sakshi News home page

‘కూపన్’తో కూపీ లాగారు..

Published Tue, Feb 24 2015 12:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

'Coupon' dragged to kupi

దొంగలను పట్టించిన గీకి పడేసిన రీచార్జ్ కార్డు
సేమియూ పెట్టి నగలు ఎత్తుకెళ్లిన కేసులో కీలకంగా పని చేసిన క్లూ
చిక్కుముడి విప్పిన ఎస్సై రవీందర్
 

వరంగల్ క్రైం : చిన్న క్లూ.. అదిఎంతటి పెద్ద కేసునైనా ఛేదించేందుకు పోలీసులకు ఒక్కో సందర్భంలో ఉపయోగపడొచ్చు. ఎంతటి నేరస్తుడైనా నేరానికి పాల్పడే  హడావుడిలో ఏదో ఒకటి జారవిడుచుకుంటాడు.. చివరికి నేరస్తుడు వాడిపడేసిన పనికిరాని వస్తువు కూడా పోలీసులకు దారి చూపుతుంది. ఇటీవల వరంగల్ నగరంలోని శివనగర్‌లో వృద్ధదంపతులకు సేమియా ఇచ్చి నగలు ఎత్తుకెళ్లిన దొంగల విషయంలోనూ ఇదే జరిగింది. గదిలో తమకు సంబంధించిన ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు తీసుకెళ్లడంతో కేసు మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారిన సమయంలో అక్కడే వాకిట్లో లభించిన గీకి పారేసిన రీచార్జ్ కూపన్ తిరుగులేని ఆధారాన్నిచ్చింది. కూపన్ సాయంతోనే పోలీసులు కూపీ లాగి నిందితులను పట్టుకోగలిగారు.


కేసు వివరాల్లోకి వెళితే.. శివనగర్‌లో వృద్ధ దంపతులకు సేమియాలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఇళ్లు గుల్ల చేసిన  విషయం తెలిసిందే. భార్యాభర్తల పేరుతో వారింట్లో 20 రోజుల క్రితం అద్దెకు దిగిన వారిద్దరు  ఈ నెల 12న రాత్రి తమ పెళ్లి రోజని నమ్మించి యజమానులైన వృద్ధ దంపతులకు సేమియాలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు మత్తులోకి జారగానే ఒంటిమీదున్న నగలతో పాటు టీవీ, డీవీడీ, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారు తమ వస్తువులను చీపురుపుల్లతో సహా తీసుకెళ్లారు. వారు తమ సెల్‌నంబర్లు, అడ్రస్ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

క్లూ దొరికిందిలా...

ముందస్తు పథకం ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లో వదలకుండా తీసుకెళ్లిన దొంగ దంపతులు హాయిగా తమ స్వగ్రామం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. నగరంలో  కొత్త తరహాలో దొంగతనం జరగడంతో పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఆధారాల కోసం వారు కిరాయికి ఉన్న ఇంట్లో అంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి చిన్న క్లూ దొరికింది. అదేమిటంటే గీకి పారేసిన చిన్న రీచార్జ్ కూపన్. సదరు దొంగ తన సెల్‌లో బాలెన్స్ కోసం రీచార్జ్ కూపన్‌ను సమీపంలోని ఒక షాపు నుంచి కొనుగోలు చేశాడు. ఆ రీచార్జ్ కార్డులోని బాలెన్స్ వేసుకుని కార్డును ఇంటి ఆవరణలోనే పడేశాడు. ఇది పోలీసుల కంట పడింది. కూపన్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సదరు కంపెనీ సెంటర్ సాయంతో రీచార్జ్ కార్డ్‌లోని అంకెల ఆధారంగా అవి ఏ నంబర్‌కు రీచార్జ్ అయ్యాయో తెలుసుకున్నారు. తర్వాత సెల్‌నంబర్‌ను టవర్ లొకేషన్‌కు పెట్టారు. టవర్ లొకేషన్ చూపించిన విధంగా పోలీసులు సదరు దొంగ దంపతులు గుంటూరు జిల్లాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక బృందం వారి ఆచూకీ కోసం గుంటూరుకు వెళ్లింది.

స్థానిక పోలీసులకు విషయం చెప్పి తమ పనిలో నిమగ్నమయ్యారు. టవర్ లొకేషన్ ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రంలోని సీతమ్మవారి పేటలో వారు ఉన్నట్లు సెల్ లొకేషన్ చెబుతోంది. అయితే వారిని గుర్తుపట్టేందుకు పోలీసులు స్థానికంగా చూసిన వారిని తీసుకెళ్లారు. సీతమ్మవారిపేటలో మద్యం కోసం దొంగ బార్ షాపునకు రాగా అతడిని గుర్తించిన శివనగర్ వాసి పోలీసులకు చూపించాడు. తర్వాత దొంగ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అతడిని అనుసరించారు. సంపన్నుల కాలనీలో ఉంటున్న ఆ దొంగలను పట్టుకునేందుకు చూస్తుండగానే వారు మళ్లీ దొంగతనం చేయడానికి వరంగల్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని వెంబడించి గవిచర్ల వద్ద పట్టుకుని విచారించారు. తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్న దొంగలు చోరీ సొత్తును అప్పగించారు. విచారణలో వారిద్దరు అసలు దంపతులు కారని, దొంగతనం కోసం ఒకటై ఇదే వృత్తిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. నేర పరిశోధనలో ఇటీవల మిల్స్‌కాలనీ సెకండ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ విశేషంగా కృషి చేసి అధికారుల మెప్పుపొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement