
సాక్షి, హైదరాబాద్: ఆరెస్సెస్, బీజేపీలు రాజ్యాం గాన్ని తిరస్కరిస్తూ, మహిళల సమానత్వాన్ని కాలరాస్తూ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మఖ్దూం భవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాల్లో దేవుళ్లను కొలిచే అవకాశాన్ని కూడా మహిళలకు దక్కకుండా చేస్తున్నారన్నారు. రఫేల్ ఒప్పందానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పినందున సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు చెబుతూ, మరోవైపు శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీం తీర్పు ఇచ్చినా, దానిని అమలు చేయకుండా ఇది సంప్రదాయాలకు చెందిన విషయమంటూ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారన్నారు.
శనిసింగనాపూర్‌లోని శనీశ్వర ఆలయంలోనికి మహిళల ప్రవేశం, ముంబైకి సమీపంలోని ఒక మసీదులో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేయగా లేనిది శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం ఆదేశాలను కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అమలు చేస్తే తప్పయిందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు,కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని సురవరం ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.
రఫేల్‌పై జేపీసీ వేయాల్సిందే...
రఫేల్ ఒప్పందంపై జేపీసీని ఏర్పాటు చేసి, అందులోని నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందేనని సురవరం డిమాండ్ చేశారు. జేపీసీ వేయకుండా నిరాకరించడం ద్వారా అవినీతిని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఎక్కువ జిల్లాలు చేస్తే గొప్పా?: చాడ
రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు పెంచితే అంత గొప్పా అంటూ సీఎం కేసీఆర్‌ను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. జిల్లాల సంఖ్యను 33కు ఎందుకు పెంచారో కేసీఆర్‌కే తెలియాలన్నారు. చేతిలో అధికారం ఉందని దాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేసి పరిపాలన గబ్బు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్షాలు లేని రాష్ట్రాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారా అని నిలదీశారు. ఎన్నికల కోడ్ అనేది కేబినెట్ విస్తరణకు అడ్డంకి కాదని ఒక ప్రశ్నకు చాడ జవాబిచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో ‘మోదీ హటావో దేశ్‌కో బచావో’నినాదంతో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. కార్మికసంఘాలు 3సార్లు సమ్మె చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment