
ప్రతీకాత్మక చిత్రం
పల్లెల్లో అంధకారం అలుముకోనుందా? చీకటి పడితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనా? రోజువారీ నీటి సరఫరా కూడా నిలిచిపోనుందా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఏళ్లుగా విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో వీధిలైట్లు, నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన కనెక్షన్లను తొలగించేందుకు డిస్కంలు సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోవడంపై కన్నెర్ర చేస్తున్నాయి. కచ్చితంగా చెల్లించాల్సిందేనని నోటీసులు అందజేస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో వీధిలైట్లు, నీటి కోసం వినియోగించే బోరుబావులు, నీటి పథకాలకు విద్యుత్ వాడకం తప్పనిసరి. ఈ కేటగిరీల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,200 విద్యుత్ కనెన్షన్లు ఉన్నట్లు అంచనా. ఇందులో సుమారు రెండు వేల కనెక్షన్లు జీహెచ్‌ఎంసీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. అక్కడ విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా ఆయా పాలక సంస్థలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 3,200 కనెక్షన్లు గ్రామాల్లోనివి.
ఇక్కడ నిత్యం విద్యుత్ వినియోగం జరుగుతున్నా బిల్లులు చెల్లించలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించేది. కొన్నేళ్ల కిందట ఆ విధానానికి స్వస్తి పలకడంతో భారమంతా పంచాయతీలపైనే పడింది. ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలయ్యే డబ్బుల్లోంచే బిల్లులు చెల్లించుకోవాలని స్పష్టం చేయడంతో అప్పటి నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా పంచాయతీల్లో పన్నులు అరకొరగానే వసూలవుతున్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించడం భారంగా పరిణమించింది.
బోరుకు బిగించిన విద్యుత్ మీటర్
ఈ ఏడాది రూ.కోటి వసూలు
పల్లెల్లో వీధిలైట్లు, తాగునీటి బోరుబావుల మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారుల నుంచి సంకేతాలు వెలువడుతుండడంతో సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాలకు వస్తున్న నిధులు అభివృద్ధి పనులకే చాలడం లేదు. ఇలాంటి సమయంలో కరెంటు బిల్లుల మాటెత్తితే సర్పంచ్‌లు బెంబేలెత్తుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఒక్క ఏడాదిలోనే సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ డిస్కం సర్కిళ్ల పరిధిలో సుమారు రూ.31 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఇందులో సైబర్ సిటీ పరిధిలో రూ.1.03 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలు చెల్లించాలని విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో నోటీసులు జారీ చేస్తున్నారు.
ఒక్క డివిజన్‌లోనే రూ.19 కోట్ల బకాయి
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బకాయిలు రూ.19 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది కరెంట్ సరఫరా నిలిపేస్తామని డిస్కం అధికారులు హెచ్చరించడంతో గ్రామ కార్యదర్శులు రూ.60 లక్షల బకాయిలు చెల్లించారు. ఇదే చివరిసారి. ఆ తర్వాత ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ప్రస్తుతం బకాయిలు చెల్లిస్తారా.. విద్యుత్ సరఫరా నిలిపేయాలా అని అధికారుల నుంచి గ్రామ కార్యదర్శులకు హెచ్చరికలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగిస్తున్నందుకు కచ్చితంగా ప్రతినెలా బిల్లులు చెల్లించాల్సిందేనని, బకాయిలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపేస్తామని ఇబ్రహీంపట్నం ఏడీ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
అభివృద్ధికే నిధుల్లేవు..
ప్రజల అవసరాల కోసం వినియోగించే వీధిలైట్లు, బోరుమోటార్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేం. మా గ్రామానికి రూ.లక్షల్లో బిల్లు బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికే సరిపోవడం లేదు. ఇక విద్యుత్ అధికారులకు బకాయిలు ఎలా చెల్లించేది. ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలి. విద్యుత్ బకాయిల భారం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం.
– వర్థ్యవత్ రాజునాయక్, నందివనపర్తి సర్పంచ్, యాచారం మండలం
Comments
Please login to add a commentAdd a comment