సాక్షి, హైదరాబాద్: ప్రశాంతంగా, శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆందోళనలను సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమే సెక్షన్ 8 ప్రస్తావన అని పీసీసీ మాజీ అధ్యక్షులు, పార్టీ ఉన్నతస్థాయి కమిటీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సంబంధంలేని ఓటుకు నోటు వ్యహారాన్ని అడ్డంపెట్టుకుని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ఒకరు, హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించి లబ్ది పొందాలని మరొకరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలో రెండు రాష్ట్రాల్లోనూ సానుకూల వాతావరణం నెలకొందన్నారు. ఇప్పుడు మైండ్‌గేమ్ ఆడుతూ, మాసిపోయిన విద్వేషాలను రెచ్చగొట్టొద్దన్నారు. సెక్షన్ 8 అమలు ప్రస్తావన ఇప్పుడెందుకని, హైదరాబాద్‌లో ఎవరిపైనా దాడులు జరిగాయని డీఎస్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గవర్నరు జోక్యం చేసుకోవాల్సినంత అవసరం ఉందా అని అన్నారు. దేశ ప్రజలు ఎక్కడివారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడుతున్నా హైదరాబాద్‌లో స్వేచ్చగా జీవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. కేవలం దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలకోసమే ఇలాంటి ఆందోళన కలిగించే ప్రయత్నాలకు దిగుతున్నారని విమర్శించారు. సెక్షన్ 8 అమలుకు అవకాశమే లేదని, ఈ పరిస్థితుల్లోనే ఆమరణ నిరాహారదీక్ష అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టడం సరికాదన్నారు.
సెక్షన్8ను అంగీకరించకుంటే విభజనను అంగీకరించబోమంటూ ఆంధ్రా మంత్రులు మాట్లాడుతున్న వాటిపై డీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమన్నా సమంజసంగా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికే 55 ఏళ్లుగా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణను సుఖంగా బతకనీయకుండా కుట్రలు చేయొద్దని హెచ్చరించారు. తెలంగాణ ఆదాయానికి గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు, ఆందోళనలను సృష్టించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తామని డీఎస్ హెచ్చరించారు. ఒక పార్టీ సీనియర్‌నేతగానే సెక్షన్ 8పై మాట్లాడుతున్నానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
రాజకీయలబ్ధి కోసమే సెక్షన్-8 ప్రస్తావన- డీఎస్
Published Wed, Jun 24 2015 9:20 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement