
హైదరాబాద్ జోలికొస్తే ఖబడ్ధార్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే వచ్చేది దొరల పాలనే అని ఆయన అన్నారు. కేసీఆర్కు అధికారం ఇస్తే చెప్పులు నెత్తిన పెట్టుకొని నడవాల్సిందేనన్నారు. బతకటానికి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ తమపై పెత్తనం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలు తిరగబడితే ఏమవుతారో అనేది కేసీఆర్ ఆలోచించుకోవాలని దానం వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు కలెక్షన్స్ కోసం కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలు ఎవరూ టీఆర్ఎస్కు విరాళాలు ఇవ్వందని సూచించారు. పద్దతి మార్చుకోవాల్సిందే...లేకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. టీఆర్ఎస్కు 30 లేదా 40ని మించి సీట్లు రావని దానం జోస్యం చెప్పారు. ఇప్పటికే పార్టీలోకి కొడుకు, కూతురు, అల్లుడిని తెచ్చిన కేసీఆర్ ఇక మనవడిని కూడా తీసుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడ ఉందని దానం ప్రశ్నించారు.