మెదక్ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తున్న వైద్యుడు
సాక్షి, మెదక్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ సంబంధిత రోగులకు వరంగా మారాయి. గతంలో డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అపుడు దూరాభారంతో పాటు ఒక్కో సెట్టింగ్‌కు రూ.1500 నుంచి రూ.1900 చెల్లించాల్సివచ్చేంది. ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ బాధలు తొలిగిపోయాయి. జిల్లా కేంద్రంలో గత ఏడాది డిసెంబర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందంతో అందరూ ఇక్కడే రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో ఒకే సారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు మిషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కబెడ్ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన వైద్యులు, సిబ్బంది ఉండటంతో రోగులకు ఇబ్బందులు తొలిగిపోవడంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 35 మందికిపైగా డయాలసిస్ అవసరమయ్యే రోగులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కిడ్నీలు సరిగా పనిచేయని పక్షంలో డయాసిస్(రక్తశుద్ధి) ప్రక్రియ అవసరం ఉంటుంది. ఈ రకమైన సమస్య ఉన్న వారు, మూత్రపిండాల మార్పిడి సమయంలో రక్తశుద్ధి (డయాలసిస్) తప్పనిసరి. గతంలో ఆరోగ్యశ్రీలో డయాలసిస్ సేవలు అందించినప్పటికీ హైదరాబాద్ వెళ్లడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవారు.
ఉచితంగా మందులు ఇవ్వాలి..
జిల్లాలోని 35 మంది రోగులకు గడిచిన ఆరు నెలల్లో 180 సార్లు డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయించుకునే పేషెంట్ 4 గంటల నుంచి వ్యాధి తీవ్రతను బట్టి 8 గంటల వరకు బెడ్‌పై ఉండాల్సి వస్తోంది. వైద్యులు, సిబ్బంది మంచిగా సేవలు అందజేస్తున్నట్లు వారు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు చెబుతున్నారు. కరెంటు పోయిన సమయంలో వెంటనే జనరేటర్ పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చిన్నశంకరంపేటకు చెందిన ఓ రోగి తెలిపారు.
డయాలసిస్ సెంటర్‌కు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని రోగులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా మందులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత డయాలసిస్ మెదక్‌లో పొందే సౌకర్యం కల్పించడం హర్షనీయం. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని పలువురు రోగులు కోరుతున్నారు.
నర్సాపూర్ ప్రాంతంలో 6మంది వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం డయాలసిస్ కోసం మెదక్‌కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు కూడా వెళ్తున్నారు. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి రోగులకు సౌలభ్యంగా ఉంటుందని శివ్వంపేటకు చెందిన ఆనంద్‌రావు తెలిపారు.
బతుకుపై ఆశ కలిగింది
నేను 12 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాను. 2006లో కిడ్నీ మార్పిడి జరిగింది. తర్వాత అది విఫలమై రెండు కిడ్నీలూ చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ కోసం లక్షల రూపాయాలు ఖర్చు పెట్టాను. డయాలసిస్ కోసం ప్రతివారం హైదరాబాద్ వెళ్లే వాడిని. ఇప్పటివరకు రూ.15 లక్షల వరకు ఖర్చుయ్యాయి.
దీంతో ఎంత కాలం చేయించుకోను.. ఇక అనుకున్న సమయంలో మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు బతుకుపై ఆశ కలిగింది. దీంతో ఇక్కడే వారానికి రెండు సార్లు చేయించుకుంటున్నాను. దూరభారం తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. –ఎర్రగొల్ల సత్యం, రామాయంపేట
Comments
Please login to add a commentAdd a comment