అయ్యా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు. నేను మీ మానసపుత్రికను. నాకు 2008లో ‘108’ అని నామకరణం చేసింది మీరే. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు ‘108’అనే నంబర్‌కు డయల్ చేస్తే, అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ వాహనాన్ని క్షణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మండలాల విస్తీర్ణం, గ్రామాలు, జనాభా తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకుని అంబులెన్స్‌లను కేటాయించారు.
అంబులెన్స్‌లో ఆక్సిజన్, గ్లూకోజ్ బాటిళ్లు, ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అంబులెన్స్ వాహనాన్ని వేగంగా నడపడానికి మంచి శిక్షణ పొందిన వారిని పైలట్‌లుగా నియమించారు. ప్రథమ చికిత్స అందించడానికి శిక్షణ పొందిన వారిని టెక్నీషియన్‌లుగా నియమించారు.
మీరు ఉన్నప్పుడు...
మీరు బతికి ఉన్నప్పుడు 108 అంబులెన్స్‌లకు ఎలాంటి అవసరం ఉన్నా నిధులు వెంటనే కేటాయించారు. మీరు నన్ను ప్రవేశపెట్టిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మరే ఇతర ప్రమాదాల్లో ఉన్నవారి పరిస్థితి విషమించక ముందే వారిని సకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి బతికి బట్టకట్టేలా చేశారు. పెద్ద పెద్ద కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారు వాటిని ఎలా సంరక్షించుకుంటారో మీరు మా అంబులెన్స్ వాహనాలను అలాగే చూసుకున్నారు.
108కి ఎలాంటి ఇబ్బంది, సమస్య లేకుండా కష్టం, నష్టం జరగకుండా మమ్మల్ని కన్నబిడ్డల వలే చూసుకున్నారు. మీరు చేసిన ఈ మంచి పనితో మాకు ‘సంజీవని’ అని పేరును ప్రజలు పెట్టారు. గర్భిణులు ప్రసవ వేదనతో ఉంటే వారిని సురక్షితంగా అంబులెన్స్‌లలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆస్పత్రులకు అద్దె వాహనాలు, అద్దె అంబులెన్స్‌లను ఉపయోగించుకునే అవసరం లేకుండా చేశారు.
మీ మరణంతో మాకు కష్టాలు చాలు...
అయితే మీ మరణంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మీరు ఎంతో సహృదయంతో ప్రవేశపెట్టిన వైద్య సేవలను మీ తర్వాత రోశయ్య, కిరణ్ సర్కార్‌లు తొక్కి పడేశాయి. అంబులెన్స్‌లకు వినియోగిస్తున్న వాహనాలు 3 లక్షల కిలోమీటర్లు దాటితే వాటిని మార్చి కొత్త వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐదేళ్ల కింద మీరు ఇచ్చిన వాహనాలే అనేకం ఉన్నాయి. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏడాదికి ఒకసారి వాహనాలను మార్చివేస్తున్నారు. మార్కెట్‌లో కొత్త మోడళ్లు వస్తే నిన్న, మొన్న కొన్న వాహనాలను మార్చివేసిన ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
అయితే నేను ఆపదలో ఉన్నవారిని చికిత్స అందిస్తూ తరలిస్తాను. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండే నాకు సుస్తి చేస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాహనాల లైఫ్ టైం అయిపోయినా మరమ్మతులు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వాహనాలను మార్చడానికి నిధులు ఉంటాయి. కాని అపర సంజీవనిగా పేరుపొందిన అంబులెన్స్‌లను మార్చడానికి ఎవరికి దయరాదు. వాహనం పాతబడటంతో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదు.
మేమే బాగుంటే మహబూబ్ బతికేవాడేమో...
మొన్న మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద చెట్టుపై నుంచి కిందపడిన మహబూబ్‌ను ఆస్పత్రికి తరలించడానికి నేను అక్కడికి వెళ్లాను. అయితే నా డోర్ తెరుచుకోలేదు. చాలాసేపు మా అంబులెన్స్ సిబ్బంది కష్టపడి డోర్ తెరిచారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించే సమయంలో మళ్లీ డోర్ ఊడిపోయింది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించడానికి నేను చాలా కష్టపడ్డాను.
కాని విధి వక్రీకరించింది. క్షతగాత్రుడిని సకాలంలో నేను ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే బతికి బట్టకట్టేవాడేమో? నా నిర్లక్ష్యం ఇందులో లేకపోయినా.. ప్రభుత్వం నన్ను మార్చక పోవడం మాత్రం నిజం. మీరే బతికి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? మమ్మల్ని మార్చేవారు కాదా? మమ్మల్ని మార్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేవారు. మీరులేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే మీరు మన్నించాలని మనస్పూర్థితో కోరుకుంటూ....
ఇట్లు
మీ మానసపుత్రిక ‘108’ అంబులెన్స్
మీరులేక.. మమ్మలి పట్టించుకోక...
Published Tue, Apr 1 2014 2:39 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement