సాక్షి, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన ‘దిశ’అత్యాచార నిందితుల మృతదేహాలకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సోమవారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ వైద్యులు ఆదివారం నగరానికి చేరుకున్నారు. ఈ బృందం లో ఎయిమ్స్ ఫోరెన్సిక్ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా, డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ ఉన్నారు. వారికి సహాయకుడిగా డాక్టర్ వరుణ్ చంద్ర వ్యవహరిస్తారు. ఈ బృందం సోమ వారం ఉదయం 9 గంటలకు రీ పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభిస్తుంది.
ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి చేసేందుకు సుమారు 6 గంటల సమయం పట్టనుంది. రీ పోస్టుమార్టం ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు నివేదికతోపాటు వీడియో దృశ్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టా రు. రీ పోస్టుమార్టం ముగిసిన తర్వాత మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేటప్పటికే రాత్రి అవుతుందని, అప్పుడు అంత్యక్రియలు జరిపే అవకాశం ఉండదని కుటుంబ సభ్యులు తెలిపితే రీ పోస్టుమార్టం చేసిన మృతదేహాలను మళ్లీ మార్చురీలోనే భద్రపరిచి, మంగళవారం ఉదయం అందజేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో, ఇతర మృతదేహాలకు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..
గాంధీ మార్చురీ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, సుమారు వంద మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో గాంధీ మార్చురీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment