విభజన.. విచిత్రం | Division .. weird | Sakshi
Sakshi News home page

విభజన.. విచిత్రం

Published Thu, Mar 27 2014 12:11 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

విభజన.. విచిత్రం - Sakshi

విభజన.. విచిత్రం

‘గ్రేటర్’ నియోజకవర్గ పునర్విభజన గందరగోళంగా మారింది. కొత్త నియోజకవర్గాలు కొన్ని నిజంగానే వింత గొలుపుతున్నాయి.

  •      ఊరొక చోట... పేరొక చోట..       
  •      నియోజకవర్గాలు గల్లంతు
  •      పునర్విభజన అస్తవ్యస్తం  
  •      ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్   
  •      కూకట్‌పల్లి సగభాగం శేరిలింగంపల్లిలోనే..   
  •      సికింద్రాబాద్ దాదాపు సనత్‌నగర్‌లోకి..    
  •  సాక్షి నెట్‌వర్క్ : ‘గ్రేటర్’ నియోజకవర్గ పునర్విభజన గందరగోళంగా మారింది. కొత్త నియోజకవర్గాలు కొన్ని నిజంగానే వింత గొలుపుతున్నాయి. నిబంధనల్ని వెక్కిరిస్తూ ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి. వాస్తవానికి ఒక డివిజన్ ఒకే నియోజకవర్గంలో పూర్తిగా ఉండాలి. అంతేకాదు చుట్టూరా ఉన్న ప్రాంతాలకు సమదూరంలో నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ నగరంలో ఈ నిబంధనల్నేం పట్టించుకోలేదు.

    జూబ్లీహిల్స్ పేరుతో నియోజకవర్గం ఉన్నా జూబ్లీహిల్స్ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో వచ్చి చేరింది. కూకట్‌పల్లి నియోజకవర్గం ఉన్నా.. కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాలు శేరిలింగంపల్లిలోకి వెళ్లాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్ లేనే లేవు. ఇక సికింద్రాబాద్ చుట్టూరా ఉన్న ప్రాంతాలను సనత్‌నగర్‌లో కలిపేశారు. ఇలా పేరొక చోట.. ఊరొక చోట.. పెట్టి విభజన తంతు కానిచ్చేయడంతో పునర్ వ్యవస్థీకరణ జంబలకిడిపంబలా తయారైంది.  

    రూపు.. మ్యాప్.. మారిపోయి నియోజకవర్గాల ముఖచిత్రం విచిత్రంగా తయారైంది. పునర్విభజన ఫలితంగా కూకట్‌పల్లి నియోజకవర్గం కకావికలైంది. విచిత్రమేమిటంటే ఇక్కడ ఒకే ఏరియా.. రెండు నియోజకవర్గాలుగా విడిపోయింది. కూకట్‌పల్లి నియోజకవర్గానికి గుండెకాయలాంటి కూకట్‌పల్లి డివిజనే రెండు నియోజకవర్గాల్లో ఉంది. పేరుకు కూకట్‌పల్లి ఉన్నప్పటికీ కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలన్నీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి.

    ముఖ్యంగా కూకట్‌పల్లిలో సీతారామచంద్రస్వామి దేవాలయం, పాపారాయుడునగర్‌తోపాటు కొన్ని బస్తీలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేర్చారు. కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలైన కూకట్‌పల్లి, బాగ్‌అమీర్, విశాల్ టవర్స్‌తోపాటు కూకట్‌పల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర నగర్, జగద్గిరిగుట్ట పార్టులతో పాటు మరో 15 కాలనీలు శేరిలింగంపల్లిలో ఉన్నాయి. వివేకానందనగర్, హైదర్‌నగర్ డివిజన్‌లూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే చేరాయి.

    కూకట్‌పల్లి ప్రాంతానికి దూరంగా ఉన్న బేగంపేట, మోతీనగర్, పాతబోయిన్‌పల్లి, ప్రకాశ్‌నగర్ వంటి ప్రాంతాలు మాత్రం కూకట్‌పల్లి నియోజకవర్గంలోకి వచ్చాయి. బేగంపేట డివిజన్‌లో కొంతభాగం సనత్‌నగర్ నియోజకవర్గంలోకి రాగా.. మరికొంతభాగం కూకట్‌పల్లి నియోజకవర్గంలోకి వచ్చింది. వివేకానందనగర్ డివిజన్ శేరిలింగంపల్లితో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో ఆవరించి ఉంది.
     
    ముక్కలైన అలియాబాద్  
     
    నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అలియాబాద్ డివిజన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉండేది. పునర్విభజన అనంతరం ఈ డివిజన్‌ను రెండు ముక్కలు చేశారు. 18-4, 18-5 వార్డులు బహదూర్‌పురా నియోజకవర్గంలోకి, 23-4, 23-5 వార్డులు చార్మినార్ నియోజకవర్గంలోకి వచ్చాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలోని యాప్రాల్ డివిజన్ సగభాగం ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్‌లో ఉంది. అందుకే యాప్రాల్ కార్పొరేటర్ రెండు నియోజకవర్గాల రివ్యూ మీటింగ్‌లకు హాజరవుతారు. ఇక బర్కత్‌పుర డివిజన్ అంబర్‌పేట నియోజకవర్గంలో ఉంది. డివిజన్‌లోని రాజ్‌మెహాల్లా, పర్వరీష్‌బాగ్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి.
     
    యాకుత్‌పురా, చార్మినార్ గల్లంతు
     
    జీహెచ్‌ఎంసీ 2009 కార్పొరేటర్ ఎన్నికలకు ముందు యాకుత్‌పురా నియోజకవర్గంలో యాకుత్‌పురా డివిజన్ ఉండేది. పునర్విభజన తర్వాత యాకుత్‌పురా డివిజన్ పేరును తొలగించి ఇందులో కొన్ని ప్రాంతాలను కుర్మగూడ డివిజన్‌గా, మరికొన్నింటిని రెయిన్‌బజార్ డివిజన్‌గా మార్చారు. ప్రస్తుతం యాకుత్‌పురా నియోజకవర్గంలో యాకుత్‌పురా పేరుతో డివిజన్ లేదు. అదేవిధంగా చార్మినార్ డివిజన్‌ను తొలగించి షాలిబండ డివిజన్‌లో చేర్చారు.
     
     రూపు మారిన సికింద్రాబాద్

     పేరుకే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం.  నిజానికి ఈ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు. పునర్ వ్యవస్థీకరణతో నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సికింద్రాబాద్ పేరుతో ఆవిర్భవించిన శాసనభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ ప్రాంతాలు మచ్చుకైనా కనరావు. సికింద్రాబాద్‌కు ఐకాన్‌గా చెప్పుకునే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ ఆసుపత్రి, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, మహబూబ్ కళాశాల తదితరప్రాంతాలన్నీ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. సికింద్రాబాద్ గేట్‌వేగా పిలిచే క్లాక్‌టవర్, గార్డెన్ ప్రాంతాలు కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాయి. సికింద్రాబాద్‌కు శివారు ప్రాంతాలుగా ఉన్న బౌద్ధనగర్, చిలకలగూడ, సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, లాలాపేట ప్రాంతాలను ఏకం చేసి సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని చెప్పుకోదగిన ప్రాంతాలన్నీ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిపోగా.. శివారు ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి.
     
     నానాజాతి సమితిలా సనత్‌నగర్


     నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సనత్‌నగర్, బల్కంపేట, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, పద్మారావునగర్ మున్సిపల్ డివిజన్లతో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో మొదటి మూడు డివిజన్లు సర్కిల్-10 (ఖైరతాబాద్) పరిధిలో ఉండగా... మరో నాలుగు డివిజన్లు సర్కిల్-18 (సికింద్రాబాద్)లో ఉన్నాయి. అయితే కొన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో సనత్‌నగర్ నియోజకవర్గంలో కాకుండా కొంతభాగం ఇతర నియోజకవర్గాల్లో సైతం వ్యాపించి ఉన్నాయి. బేగంపేట డివిజన్‌లో కొంతపార్ట్ (బ్రాహ్మణ్‌వాడీ, అల్లంతోట బావి, శ్యాంలాల్ బిల్డింగ్స్, ప్రకాశ్‌నగర్ కొంత భాగం, భగవంతాపూర్) కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉండగా.. మిగతా భాగం (పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్స్ తదితర ప్రాంతాలు) సనత్‌నగర్ నియోజకవర్గం కిందికి వస్తోంది. అదేవిధంగా రాంగోపాల్‌పేట్ డివిజన్ విషయానికొస్తే ఆ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలు (శివాజీనగర్, కుమ్మరిగూడ, సెకండ్ బజార్) కంటోన్మెంట్ నియోజకవర్గంలో వ్యాపించాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement