బాత్రూమ్లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది..
* కట్నం కోసం చిత్ర హింస
*హత్య చేసేందుకు యత్నం
*బాత్‌రూమ్‌లో దాక్కొని పోలీసులకు ఫోన్ చేసిన నవవధువు
*రక్షించిన పోలీసులు
హైదరాబాద్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నవ వధువును సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రక్షించారు. భర్త, అత్తల చిత్రహింసలు భరించలేని ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ వేసుకుని 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమై పోలీసులు బాధిత యువతిని రక్షించారు. ఈ సంఘటన నిన్న తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్‌బజార్‌కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌తో ఆగస్టు 15న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందగా.. తల్లి లక్ష్మితో తాతాచారి కాలనీలో ఉంటున్నాడు. వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నంగా అరుణ తల్లిదండ్రులు ఇచ్చారు. రెండు నెలలపాటు అరుణను బాగానే చూసుకున్న భర్త, అత్త ఆ తర్వాత తమ విశ్వరూపం చూపించారు.
చంద్రశేఖర్ నిత్యం పీకలదాకా మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలోనే అత్త లక్ష్మి కట్నం ప్రస్తావన తేవడంతో అదనపు కట్నం కావాలని వేధించేవాడు. తల్లిదండ్రులకు అదనపు కట్నం ఇచ్చే స్తోమత లేకపోవడంతో అరుణ అత్తింతివారి వేధింపులను భరిస్తూ వచ్చింది. ఇటీవల వేధింపులు తీవ్రమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ తల్లి సహాయంతో అరుణను చిత్రహింసలు పెట్టాడు. గొంతు నులిమే ప్రయత్నం చేయడంతో పాటు గదిలో నిర్భందించి కొట్టబోయాడు. దీంతో తనను చంపేస్తారని భావించిన అరుణ తన ప్రాణాలను కాపాడుకునేందుకు శనివారం తెల్లవారు జామున 3.30కి బాత్‌రూమ్‌లోకి పరుగెత్తింది.
వెళ్తూ .. వెళ్తూ భర్త సెల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లి 100 నెంబర్‌కు డయల్ చేసి.. భర్త తనను బంధించి చిత్రహింసలు పెడుతున్న తీరును ఫిర్యాదు చేసింది. పోలీస్ కంట్రోల్‌రూమ్ సిబ్బంది గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం పోలీసులు రెజిమెంటల్ బజార్‌లోని తాతాచారి కాంపౌండ్‌కు వెళ్లి బాత్‌రూమ్‌లో తలదాచుకున్న అరుణను రక్షించారు. అదే సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. భర్త, అత్తను రిమాండ్‌కు తరలించారు.