తీరని వెతలు | drinking water problems in district | Sakshi
Sakshi News home page

తీరని వెతలు

Published Wed, Apr 30 2014 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

drinking water problems in district

 తాగునీటికి కటకట
 వేసవి వచ్చిందంటే.. నియోజకవర్గ ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటారు. ఏటా వేసవిలో తాగునీటి కోసం వాగులు, చెలిమెలు, వ్యవసాయ బావులే దిక్కవుతున్నాయి. నియోజకవర్గంలో 400కుపైగా మంచినీటి ట్యాంకులున్నా అందులో సగానికిపైగా పని చేయకుండా అలంకారప్రాయంగా మిగిలాయి. బోర్లు, చేతిపంపుల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో చాలామంది వ్యవసాయ బావులు, చెలిమెల నుంచి నీటిని తెచ్చుకుని తాగుతున్నారు. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం కాలినడకన వెళ్తూ అవస్థలు పడుతున్నారు. ఈ నీటిని తాగుతూ కొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయినా వీరి బాధలు ఎవరికీ పట్టడంలేదు.
 
 వైద్యం.. అంతంతే
 నియోజకవర్గ ప్రజలకు సర్కారు వైద్యం పూర్తిస్థాయిలో అందని పరిస్థితి తలెత్తింది. బోథ్ మండల కేంద్రంలో పెద్దాసుపత్రి ఉన్నా అక్కడ వైద్యులు లేక ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. ఇచ్చోడ, నర్సాపూర్(టి), నేరడిగొండ, బజార్‌హత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యుల ఖాళీలు, మందుల కొరత వెంటాడుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

 శిథిలావస్థలో ప్రయాణ ప్రాంగణాలు
 నియోజకవర్గంలోని పలు ప్రయాణ ప్రాంగణాలు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారాయి. ఇచ్చోడ నుంచి ఇతర ప్రాంతాలకు రోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక్కడి బస్టాండ్ శిథిలావస్థకు చేరి వినియోగానికి వీల్లేకుండా ఉంది. దీంతో జాతీయ రహదారిపైనే తాత్కాలిక బస్టాండ్ నిర్వహిస్తున్నారు. వేసవిలో, వర్షాకాలంలో ప్రయాణికులకు కనీస నీడ లేకుండాపోయింది. బజార్‌హత్నూర్, బోథ్ మండల కేంద్రాల్లోని బస్టాండ్లు నిరుపయోగంగా మారగా తాంసి, తలమడుగు, నేరడిగొండలో బస్టాండ్లే లేవు.
 
 నీరందించని ప్రాజెక్టులు
 బోథ్ నియోజకవర్గంలో బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, బ జార్‌హత్నూర్, తాంసి, తలమడుగు మండలాలు ఉన్నాయి. కరువు కా టకాలతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలో 20 చిన్ననీటి ప్రాజెక్టులు నిర్మించారు. ఆయా ప్రాజెక్టులకు కాలువలు నిర్మించకపోవడంతో పంటలకు సాగునీరు అందని ద్రాక్షలా మారింది. ప్రాజెక్టుల్లో నీరున్నా అలంకారప్రాయంగా మిగిలాయి. తాంసి మండలంలో మత్తడి వాగు, ఇచ్చోడ మండలంలో అడేగామ-కే, గుండాల, బజార్‌హత్నూర్, భూతాయి, గుడిహత్నూర్ మండలం ముత్నూర్, తోషం, మల్కాపుర్ ప్రాజెక్టులకు నేటి వరకు కాలువలు నిర్మించలేదు. కాలువలు నిర్మించాలని రైతులు వేడుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

 అధ్వానంగా రోడ్లు
 నియోజకవర్గంలో ప్రధాన రహదారులు అధ్వానస్థితికి చేరాయి. జాతీ య రహదారి నుంచి బోథ్ వరకు 11 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. అంతర్రాష్ట్ర రోడ్డు కొన్నేళ్ల నుంచి మరమ్మతుకు నోచుకోవడంలేదు. గోట్కూరి నుంచి కరంజి వరకు 37 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు 20 ఏళ్ల నుంచి కనీస మరమ్మతుకు నోచుకోక ప్రమాదకరంగా మారింది. ప్రతీ ఎన్నికల్లో ఆయా రోడ్ల శాశ్వత మరమ్మతుకు నాయకులు హామీలు గుప్పిస్తున్నా గెలిచాక కనీసం ఈ గ్రా మాల వైపు కన్నెత్తి చూడడంలేదు. తలమడుగు మండలం నుంచి బజార్‌హత్నూర్ వరకు రోడ్డు మంజూరై పదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పను లు ప్రారంభించాలని ప్రజాప్రతినిధులను వేడుకున్నా స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement