పంటొచ్చె.. వానొచ్చె!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలోనే అకాల వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. వారంపది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు వరి సాగుచేసిన రైతులను నష్టాలపాలు చేశాయి. తాజాగా అల్పపీడనం, దానికి తోడు ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.
గురువారం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అంతేకాకుండా మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన ప్రకటన జిల్లా రైతాంగం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇటీవల వర్షాల దాటికి చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో కన్నీరుమున్నీరైన రైతు.. మిగిలిన కాస్తోకుస్తో పంటను రక్షించుకునేందుకు ఉపక్రమించాడు. కానీ తాజాగా కురుస్తున్న వర్షాలు రైతు కంట్లో కునుకు లేకుండా చేస్తున్నాయి.
భారీ నష్టం..
పక్షం రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురిశాయి. అయితే అవన్నీ పెనుగాలులు, వడగ ళ్లతో కూడిన వర్షాలు కావడంతో పంటనష్టం పెద్దఎత్తున జరిగింది. రెండున్నర వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కేవలం 1,777 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. అధికంగా ఇబ్రహీపట్నం డివిజన్ పరిధిలో ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత గత వర్షాకాలం జిల్లా రైతాంగానికి కొంత ఊరటనిచ్చింది. దీంతో జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలు వరిపంటపై పెను ప్రభావాన్నే చూపాయి. అధికారుల ప్రాథమిక గణాంకాలు ఇలా ఉన్నప్పటికీ తుది జాబితా రూపొందించే నాటికి నష్టం భారీగా నమోదు కానుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పొడిగా ఉంటేనే..
ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో చాలాచోట్ల పంటపొలాల్లో నీళ్లు నిలిచాయి. వరిపైరు మొత్తం నేలపై వాలింది. వాతావరణం పొడిగా పొలాల్లోని నీటిని తీసి వరి కోసుకునే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా వాతావరణం మారడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.
మామిడిపై దాడి..
పెనుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో జిల్లాలో మామిడి పంట భారీగా నష్టాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు 350 హెక్టార్లలో మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు రూ.రెండు కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.అసలే ధర పలకక సతమతమవుతున్న మామిడి రైతును తాజా వర్షాలు మరింత వణికిస్తున్నాయి. వరుసగా వర్షాలు కురిస్తే పండ్లకు వైరస్ సోకే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.