కొత్తగా నాలుగు విద్యా సంస్థలు
సీఎం హామీలు ఆరు నెలల్లోనే అమలు
ఇది నాకెంతో గర్వంగా ఉంది
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
వరంగల్ : వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కొత్తగా నాలుగు విద్యా సంస్థలు జిల్లాలో ఏర్పాటవుతున్నాయని... విద్యా మంత్రిగా ఇది తనకు గర్వంగా ఉందని చెప్పారు. వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, పశుసంవర్థక కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం(2016-17) నుంచి మొదలవుతాయని చెప్పారు. నాలుగు విద్యా సంస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు. కొత్త విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ సంస్థలకు అనువైన స్థలాల ఎంపిక కోసం ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం పరిశీలించారు. నాలుగు సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌజ్‌లో ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 4, 5, 6 తేదీల్లో వరంగల్ జిల్లాలో పర్యటించారు. 6న అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలో నెలకొల్పాల్సిన సంస్థలపై ప్రతిపాదనలను ఇస్తే పెద్ద మనసుతో వెంటనే అంగీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలపై అభిమానంతో వ్యవసాయ కాలేజీ, పత్తి పరిశోధన కేంద్రం, పశుసంవర్థక కాలేజీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే 2016 జూన్-జూలై నుంచే తరగతులు జరుగుతాయి.
ఈ విద్యా సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలు నగరం చుట్టుపక్కల ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులతో కలిసి పరిశీలించాం. హన్మకొండ మండలం మామునూర్‌లో పశుగణన కేంద్రం వద్ద ఉన్న 120 ఎకరాల భూమిలో పశుసంవర్థక కాలేజీని ఏర్పాటు చేసేందుకు వెటర్నరీ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదించనున్నాము. ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్)కు ప్రతిపాదిస్తున్నాము. ఇక్కడే పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నాము. సిద్ధాపూర్-అర్వపల్లి మధ్యలో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వ్యవసాయ కాలేజీకి, పత్తి పరిశోధన కేంద్రానికి ఈ భూములను ఇవ్వనున్నాము. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)ను మడికొండ-రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేయనున్నాము. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో ఉన్న 18 ఎకరాల్లో హెచ్‌పీఎస్‌ను ఏర్పాటు చేసేందుకు సొసైటీ సభ్యులు అంగీకరించారు.
వెంటనే నిర్మాణం చేపట్టేందుకు హెచ్‌పీఎస్ సొసైటీకి సులభ వాయిదా పద్ధతులపై చెల్లించేవిధంగా రూ.15 కోట్ల రుణం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశాము. హెచ్‌పీఎస్‌లో వచ్చే విద్యా సంత్సరంలోనే తరగతులు ప్రారంభించనున్నారు. తాత్కాలికంగా హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్ భవనాన్ని హెచ్‌పీఎస్ వారికి అప్పగించాలని నిర్ణయించాము. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రకారం విద్యా సంస్థల ఏర్పాటుపై ఆరు నెలల్లోనే హామీలు అమలు చేయనున్నాము’ అని కడియం శ్రీహరి తెలిపారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, జెడ్పీటీసీ సభ్యులు పాలకుర్తి సారంగపాణి, కె.సుభాష్‌గౌడ్, పార్టీ నాయకులు ఎల్లావుల లలితయాదవ్ పాల్గొన్నారు.
విద్యాకేంద్రంగా ఓరుగల్లు
Published Wed, Jan 13 2016 1:29 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement