మోదీ మొగ్గు ఎమ్మెన్సీలకే
♦ చిన్న సంస్థలకు ప్రోత్సాహకం లేదు: ఈటల విమర్శ
♦ ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీకి హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో మాత్రం బహుళజాతి కంపెనీలకు దారులు తీస్తూ వారివైపే మొగ్గుతున్నారు తప్ప చిన్న సంస్థలకు మేలు చేకూర్చడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రం నుంచి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పి రెండేళ్లు అయింది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.
14వ ఆర్థిక సంఘం 42 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా కేంద్ర ప్రాయోజిత పథకాలను తగ్గించారు. పలు పథకాలను రద్దు చేశారు. కస్తూర్బా పాఠశాలలనూ ఎత్తేశారు. ఐసీడీఎస్ నిధుల్లో కోతలు పెట్టారు’’ అని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి సీఎస్టీ పరిహారం తక్షణమే ఇవ్వాలని జైట్లీని అడిగామన్నారు.. 2012-13 వరకే కాకుండా ఎప్పటివరకైతే జీఎస్టీ అమలు జరగదో అప్పటివరకు రాష్ర్టం కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేయాలని కోరామన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ యూనిట్ల ప్రోత్సాహ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 కోట్ల రూ. 5 కోట్లకు పెంచడంతోపాటు వాటికి 5 శాతం వడ్డీ రాయితీ, పన్ను రాయితీ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
అలాగే రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని నెల నెలకు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని జైట్లీని అడిగామని, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారని అడిగినట్లు చెప్పారు. ‘‘కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కూడు, గుడ్డపై దృష్టి కేంద్రీకరించాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. పేదల పట్ల ప్రేమ ఉంటే మా పథకాలకు మద్దతు ఇవ్వండి.. దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా తెలంగాణ వృద్ధి రేటు 15 శాతం ఉంది. మా ఉత్సాహానికి కేంద్రం కొంత తోడైతే బాగుంటుంది..’’ అని జైట్లీని కోరామన్నారు.
సూరజ్‌కుండ్ మేళా సందర్శన: హరియాణాలోని సూరజ్‌కుండ్ మేళాను శనివా రం రాత్రి మంత్రి ఈటల సందర్శించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెబుతూ మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను అభినందించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత వృద్ధి చెందినా మన సంస్కృతిని మరువరాదన్నారు.