హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణ పడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారడంతో ఇరువర్గాల విద్యార్థులు రాళ్లతో దాడిచేసుకున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు బైకులపై వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వకున్నారు. వారి మధ్య ఘర్షణకు గల కారణాలు తెలియలేదు.
అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి స్థానికులు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విద్యార్థుల ఘర్షణపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.