బీడీ కార్మికులకు కేంద్ర మంత్రి దత్తన్న భరోసా
అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళతా
సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్లడి
సిద్దిపేట అర్బన్ : పొగాకు ఉత్పత్తులపై అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లోనే కఠిన నిర్ణయాలు తీసుకుందని, కఠినమైన నిబంధనలపై పోరాడి ఎన్నింటినో తొలగింపజేశానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం పట్టణంలో ని శివమ్స్ గార్డెన్‌లో బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పిన పలు సమస్యలను విన్నారు.
చేతినిండా పని కల్పించాలని, డేంజర్ మార్క్ గుర్తును తొలగింపజేయాలని, పీఎఫ్ కల్పించాలని, రూ. వెయ్యి పింఛన్ ఇవ్వాలని వారు కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై 85 శాతం ప్రమాద హెచ్చరిక గుర్తును ముద్రించాలని విడుదల చేసిన జీఓ 727 (ఈ)ని అమలు చేయడంలో ఈ నెల 18, 19న ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులతో సమావేశం ఉందన్నారు. అందులో ఈ జీఓపై కఠిన నిర్ణయాలపై చర్చిస్తానని బీడీ కార్మికులకు తగిన న్యాయం జరి గేలా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే మహిళా కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లి మంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చేతితో చేసే ఈ పరిశ్రమను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు.
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో 17 లక్షల కుటుంబాలు ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని వారికి తన అండదండలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. బీడీ కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందజేస్తుందని వీటి ద్వారా పీఎఫ్ సమాచారం నేరుగా కార్మికుల సెల్‌కు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్డు రాష్ట్రీయ స్వస్త్‌బీమా, ఆమ్ ఆద్మీ బీమా, పింఛన్లకు కూడా వర్తిస్తుందన్నారు. బీడీ కార్మికులందరికి ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలను చేపడుతామని చెప్పారు. గతంలో ఇంటి నిర్మాణానికి రూ. 40 వేలు మాత్రమే ఇచ్చేవారని రూ. లక్ష ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అదే విధంగా వారికి ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దిపేటలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బీడీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మోటార్ వర్కర్స్, ఆర్చ్ ఫార్మా ఉద్యోగులు మంత్రికి తమ సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేసి సన్మానించారు. మంత్రి వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బీఎంఎస్, తెలంగాణ ప్రదేశ్ బీడీ కార్మిక సంఘం, బీజేపీ, బీజేవైఎం నాయకులు కలాల్ శ్రీనివాస్, గంగాడి మోహన్‌రెడ్డి, అమర్‌సింగ్, అంజిరెడ్డి, వంగ రాంచంద్రారెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, రాఘవులు, సుధీర్‌కుమార్, శివయ్య, మల్లేషం, కిష్టయ్య, రాజిరెడ్డి, ఉమేష్‌గౌడ్, కిషన్, రాజు, దత్తు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అండగా నేనుంటా
Published Wed, Feb 18 2015 12:58 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement