
సాక్షి, హైదరాబాద్: ఎస్సీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించే అంశంపై కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలో హామీయిచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పోడియం వద్దకు వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీనిపై మరోసారి సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రతిపక్షం పట్టించుకోలేదు. అయితే, బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని ఆయన విన్నవించారు. దీంతో కాసేపు పరిస్థితి సద్దుమణిగింది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత వర్గీకరణపై ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి మధుసూదనాచారి తిరస్కరించడంతో మళ్లీ నిరసన మొదలైంది.
ఈ విషయంలో సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని హామీయిచ్చారని, కాబట్టి దీనికి సమాధానం కావాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. సమాధానం రానందుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగానే బీజేపీ నేత కిషన్‌రెడ్డి, టీడీపీ నేత వెంకటవీరయ్య అఖిలపక్షాన్ని ఎప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తారో ప్రకటన చేయాలని కోరారు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ అఖిలపక్షంలో ఎస్సీ వర్గీకరణతోపాటు ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా ఉండాలని కోరారు.
నిరసనల మధ్య ఈటల స్పందిస్తూ అఖిలపక్షం లేకపోయినా ఇంతకుముందే వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్ చర్చించారని చెప్పారు. ఈసారి ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని ఈటల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ దీనిపై తీర్మానం చేయలేదని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఈ అఖిలపక్షం ద్వారానే కేంద్రం దృష్టికి తీసుకెళతామని హరీశ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment