లచ్చిరెడ్డిగూడెం (రామన్నపేట) : వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా దుబ్బాక గ్రామపంచాయతీ పరిధిలోని లచ్చిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైళ్ల యాదిరెడ్డి అనే రైతు ఇస్కిళ్లగ్రామ శివారులో తనకున్న పొలంతోపాటు, మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆరు ఎకరాలలో వరిని, మరో ఆరు ఎకరాలలో పత్తిని సాగుచేశాడు. భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. వరిపైరు ఎండకుండా ఉండేందుకు ఇటీవలే రెండుబోర్లు వేయగా నీళ్లుపడలేదు. దీంతో రెండున్నర ఎకరాల వరిచేను ఎండిపోయింది.
వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి చేను సైతం బాగా దెబ్బతిన్నది. వ్యవసాయంకోసం చేసిన అప్పుల భారం బాగా పెరిగిపోయింది. అప్పులు తీర్చలేనేమో అని మనస్థాపం చెందిన యాదిరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయబావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఉదయం 8గంటల సమయంలో యాదిరెడ్డి భార్య ఆండాలు భర్తకు భోజనం తీసుకొని బావి వద్దకు వెళ్లగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ జి.రాజశేఖర్ తెలిపారు.
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
Published Tue, Sep 1 2015 4:40 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement