రామన్నపేట : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన వీరమల్ల నర్సింహా(42) తన 4 ఎకరాల పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. అయితే జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో సాగుచేసిన పత్తి పంట సరిగా ఎదగలేదు. పత్తిపంట సాగు కోసం రూ. 2లక్షల అప్పు కూడా చేశాడు.
దీంతో సాగు చేసిన పంట చేతికి అంది వచ్చే అవకాశం లేకపోవడం.. కళ్ల ముందు అప్పుతీర్చే మార్గం కనిపించకపోవడంతో గురువారం రాత్రి పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య బంధువులతో కలిసి పొలం దగ్గరకు వెళ్లగా నర్సింహా విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.