సిరికొండ (నిజామాబాద్ జిల్లా): పంటలు సాగు చేసుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో కుదేలవుతున్నారని వాపోయారు. పంటల సాగుకు అయ్యే ఖర్చుతోపాటు అదనంగా 50 శాతం కలిపి పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సి ఉండగా ప్రభుత్వాలు అలా చేయడం లేదన్నారు.
‘మిషన్ కాకతీయ’ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి, చెరువుల్లో జరుగుతున్న పనులను రైతులు పర్యవేక్షించాలని సూచించారు. జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నారని, అన్నదాతలు మాత్రం తమ పంటలకు మద్దతు ధర కావాలని, సకాలంలో విత్తనాలు అందచేయాలని ఎక్కడా ఉద్యమాలు చేపట్టడం లేదన్నారు. రైతులు కూడా మహిళల లాగానే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని హక్కుల సాధన కొరకు ఉద్యమించాలన్నారు.
'అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు'
Published Thu, May 28 2015 7:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement