- కోర్టుకు కౌంటర్ దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వం
- నామమాత్రంగానే బకాయిల విడుదల
- ఇంకా చెల్లించాల్సింది రూ.3,200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాల విడుదలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం మూడు, నాలుగు సార్లు మొట్టికాయలు వేసినా, తాజాగా కోర్టుకు సమర్పించాల్సిన కౌంటర్‌ను కూడా దాఖలు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా, మంత్రుల ఇళ్లను ముట్టడించినా,చివరకు బంద్‌లకు పిలుపునిచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో విద్యార్థి సంఘాలు ఉమ్మడి నిరసనలకు సిద్ధమవుతున్నాయి. మరో 2 నెలల్లోనే వార్షిక పరీక్షలు జరగాల్సి ఉండగా, దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం తేలక ఆందోళనలకు గురవుతున్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఉపకారవేతనాలు అందుతాయో.. లేదో.. అన్న మీమాంస నెలకొంది.
రూ.460 కోట్ల మేర ఫీజుల బకాయిలను విడుదల చేసినా, అవి అరకొరే అయ్యాయి. పాతబకాయిల చెల్లింపునకే ఇంకా రూ.600 కోట్లపైగా కావాల్సి ఉండగా, గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్‌కు రూ.2600 కోట్ల వరకు చెల్లించాలి. అన్నీ కలిపి రూ.3,200 కోట్లకు పైగా చెల్లించాలి. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీలు ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. తమ డిగ్రీ చదువు పూర్తయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకపోవడంతో వీరు పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఈ విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటుందని విద్యార్థిసంఘాలు అంచనావేస్తున్నాయి.
కర్కశంగా వ్యవహరిస్తోంది
‘‘ఫాస్ట్ పథకంపై తేల్చాలని, ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సంక్రాంతి తర్వాత విద్యార్థి సంఘాల ఉమ్మడి ఆందోళనలకు సిద్ధ మవుతున్నాం.’’
- శోభన్, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు
22న ఫీజు దీక్ష
‘‘ఫీజుల రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని ఈ నెల 22న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నేను ఒకరోజు దీక్ష చేస్తాం. తరువాత జిల్లాల్లో రిలే దీక్షలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తాం. సమస్యపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం’’
- శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు