రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంపు
Published Sun, Dec 4 2016 4:30 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
► డిసెంబర్ 31 చివరి తేదీ
► ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 31 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి నవంబర్ 30 నాటితో దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో భారీ మార్పులు చేసుకున్న నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియలో ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంది. ఈ పాస్ వెబ్‌సైట్‌ను సాంఘిక సంక్షేమ శాఖ దాదాపు నెలరోజుల పాటు నిలిపివేసింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారు.
కాలేజీల సమాచారం, వాటి చిరునామా తదితర అంశాలను పునరుద్ధరించి గతనెల మొదటివారం నుంచి ఈపాస్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన ఆదాయ ధ్రువీకరణపత్రాలు కొత్తగా ఏర్పాటైన మండలాల నుంచి జారీ చేయడంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మీసేవ నుంచి ధ్రువీకరణ పత్రాలు రాకపోవడంతో పెద్దసంఖ్య లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు.
దరఖాస్తు గడువును పొడిగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దరఖాస్తు గడువును ఈనెల 31కి ప్రభుత్వం పొడిగించింది. 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ దరఖాస్తును నిర్దేశిత గడువులోగా సమర్పించాలని, ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ స్పష్టం చేశారు.
Advertisement