
జంట పండుగలకు గట్టి భద్రత
ఓవైపు బోనాలు.. మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
- సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు
- చార్మినార్, ముషీరాబాద్‌లో కవాతు
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు బోనాలు.. మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిఘాను పటిష్టపరిచారు. సివిల్ పోలీసులతోపాటు బీఎస్‌ఎఫ్, ఏపీఎస్పీ, ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలను వినియోగిస్తున్నారు. ఇరువర్గాల ప్రజల్లో మనోధైర్యం కలిగించేందుకు శనివారం చార్మినార్, ముషీరాబాద్‌లో పెద్ద ఎత్తున పోలీసులు కవాతు నిర్వహించారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పండుగలు పూర్తయ్యే వరకు శాశ్వత పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్‌ను పెంచారు. ఆయా ఠాణాల పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై కన్నేశారు. సిక్‌చావుని ఘటన ను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించి, సకాలంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా రూపకల్పన చేశారు. పండుగల సందర్భంగా విద్యుత్ స్తంభాలు, రహదారులపై బ్యానర్లు, జెండాలు కట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి సూచించారు.
ముఖ్యంగా వదంతులను నమ్మవద్దని పోలీసులు కోరుతున్నారు. రంజాన్, బోనాల పండుగ సుమారు 40 రోజుల పాటు కొనసాగనుండడంతో అన్ని రోజులు బందోబస్తు కొనసాగుతూనే ఉటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక రంజాన్‌ను దృష్టిలో పెట్టుకుని రాత్రి వేళ్లలో షాపింగ్‌సెంటర్లు, హోటళ్ల వద్ద పోలీసులు గస్తీ పెంచనున్నారు. మరోపక్క ఉగ్రవాదుల కదలిక లపై కూడా దృష్టి సారించారు.
సైబరాబాద్‌లో..
రాజేంద్రనగర్, మౌలాలిలో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల ఈ జంట పండుగలను పురస్కరించుకుని మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయమై ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ డీసీపీలతో కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. రాత్రి వేళ్లలో పెట్రోలింగ్ పెంచడంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపాలని ఆయన సూచించారు. ఏ చిన్న సంఘటనను కూడా తేలిగ్గా తీసుకోకుండా అను క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులకు తెలిపారు.